కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు…రోడ్ మ్యాప్ కోరిన అమెరికా

ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు సమయంలోఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరు నాయకులను వెంటనే రిలీజ్ చేయాలని భారత్ ను అగ్రరాజ్యం అమెరికా కోరింది. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కన్పిస్తోందని, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై భారత కార్యాచరణ ఏంటో వివరించాలని ఆ దేశ దక్షిణ,మధ్య ఆసియా సహాయమంత్రి అలైస్ జి వెల్స్ కోరారు.

కశ్మీర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు అంతర్జాతీయ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ దేశ పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఇటీవల పోస్ట్ పెయిడ్ సర్వీసులను వ్యాలీలో పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంకా SMS,ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాల్సి ఉందన్నారు.

లష్కరే తోయిబా,హిజ్బుల్ ముజాహిద్దీన్,జైషే మొహమ్మద్ వంటి ఉగ్రసంస్థులు లోయలో శాంతికి తీవ్ర విఘాతకం కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ తమ భూభాగంలోని ఉగ్రవాదంపై పోరాడాల్సిందేనని ఆయన సృష్టం చేశారు. కశ్మీర్ లో హింసను సృష్టించేందుకు పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్లినవారు ఎవరైనా పాకిస్తాన్ అదేవిధంగా కశ్మీర్ ప్రజలకు శత్రువులు అని ఈ ఏడాది సెప్టెంబర్ లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పాక్ నిజాయితీగా వ్యవహరిస్తేనే భారత్-పాక్ ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ ఆరోపణలు చేయడం,దానికి అమెరికా వంత పాడటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్ భారత్ అంతర్భాగ విషయమని మోడీ సర్కార్ పదేపదే చెబుతున్నప్పటికీ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.