అచ్చం సైన్యంలా పైకికవరింగ్.. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్‌ టీమ్‌ గుట్టు ఇదే..!

పేరుకు గొప్పగా బోర్డర్ యాక్షన్‌ టీమ్‌ అని ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి.. అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది పాకిస్థాన్.

What are Pakistan Border Action Teams and How Do They Operate

Pakistan Border Action Teams: B.A.T.. బ్యాట్‌. అంటే బోర్డర్ యాక్షన్ టీమ్. ఇది పాకిస్థాన్‌ ఆర్మీలో భాగం. పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేసింది. లైన్ ఆఫ్‌ కంట్రోల్‌లో ఆధిపత్యం కోసం పాక్‌ ఈ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఎలాగూ భారత్‌ సైన్యంతో ఫేస్ టు ఫేస్ తలబడే ధైర్యం లేదు. అందుకే తెరచాటున, దొడ్డిదారిన దాడి చేసేందుకు బ్యాట్‌ను పెట్టుకుంది దాయాది దేశం. పేరుకు గొప్పగా బోర్డర్ యాక్షన్‌ టీమ్‌ అని ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి.. అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది. వీళ్లు ఎనిమిది నెలలపాటు పాక్ ఆర్మీలో.. నాలుగు వారాల పాటు పాక్ నేవీలో శిక్షణ పొందుతారు. విధుల్లో చేరాక గెరిల్లా వ్యూహాలతో దాడులు చేస్తుంటారు. కానీ ఈ టీమ్ అధికారికంగా పాక్ సైన్యం కాదు. దీని పని సరిహద్దు వెంబడి భారత్‌పై దాడులు చేస్తూ కవ్వించడమే. ఇదే పాకిస్థాన్ వంకర బుద్దిని బయటపెడుతోంది. ఉగ్రవాదులతో కలిసి సైన్యాన్ని నడుపుతున్న ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం కూడా పాకేనని స్పష్టం అవుతోంది.

భారత్‌ను చికాకు పెట్టాలని డ్రాగన్ కంట్రీ ఎత్తులు
బ్యాట్‌లో ఉగ్రవాదులను నియమించడంలో పాక్ ఎత్తుగడ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు భారత్ సైన్యానికి సజీవంగానో, చనిపోయో పట్టుబడితే అప్పుడు వారితో తమకు ఏ సంబంధం లేదని, వారు ఉగ్రవాదులని.. వాళ్లు పాక్ సైన్యంలో సభ్యులు కాదని పాకిస్థాన్ బొంకుతుందన్నమాట. ఇలా ఉగ్రవాదులనే సైన్యంలో చేర్చుకుని నిస్సిగ్గుగా వ్యవహరిస్తోన్న పాక్ బ్యాట్‌కు.. చైనా నుంచి పరోక్ష మద్దతు ఉందనేది డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ అనుమానం. ఆసియా ఖండంలో చైనాను నిలువరిస్తోంది భారత్‌. అందుకే భారత్‌ను చికాకు పెట్టాలని డ్రాగన్ కంట్రీ ఎత్తులు వేస్తోంది. పాక్ బోర్డర్ యాక్షన్‌ టీమ్‌కు సహకారం అందించడం వెనక చైనా కుట్రల వెనక మరో రీజన్‌ కూడా ఉంది. జమ్మూ, పంజాబ్‌ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తే.. భారత్ దృష్టంతా అటువైపే వెళ్తే.. అదే అదనుగా అరుణాచల్ ప్రదేశ్, గల్వానలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేయొచ్చని డ్రాగన్ వ్యూహమని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.

కార్గిల్ యుద్ధం నాటి నుంచి బోర్డర్ యాక్షన్ టీమ్ యాక్టివిటీ
పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ దుశ్చర్యలు ఇప్పుడే బయటకు రాలేదు. గతంలో ఎన్నోసార్లు వాళ్ల కుట్రలు వెలుగు చూశాయి. కానీ ప్రత్యేకంగా ఓ టీమ్‌ను పెట్టి మరీ రెచ్చగొడుతున్నారన్న విషయం తెలిసి భారత సైన్యం కూడా అలర్ట్ అయింది. అయితే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి ఈ బోర్డర్ యాక్షన్ టీమ్ యాక్టివిటీ ఉన్నట్లు తెలుస్తోంది. కార్గిల్ వార్‌ సమయంలో భారత ఆర్మీ కెప్టెన్ సౌరభ్‌ కాలియాను పాక్ బ్యాట్ చిత్రహింసలు పెట్టి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని డెడ్‌బాడీని భారత సైన్యానికి అప్పగించారు. 2000 సంవత్సరంలో నౌషెరా సెక్టార్‌లో ఆరుగురు భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. 2008లో ఓ భారత సైనికుడ్ని సజీవంగా పట్టుకుని తలనరికి చంపేశారు పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు.

Also Read: కడుపు ఎండుతున్నా భారత్ టార్గెట్‌గా కుట్రలు.. హద్దులు దాటిపోతోన్న పాక్ టెర్రర్ యాక్టివిటీ

జవాన్లు, ఉగ్రవాదులతో కలిపి ప్రైవేటు సైన్యం!
2013లో లాన్స్ నాయక్‌ హేమ్‌ రాజ్‌ను చంపడంతో పాటు BSF జవాన్‌ రాజేందర్ సింగ్‌ను కొట్టారు. 2016 మచిల్ సెక్టార్‌లో ఒకర్ని, 2017లో కృష్ణఘాటి సెక్టార్‌లో ఇద్దరు భారత సైనికులను హతం చేసింది పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్. ఆ తర్వాత కూడా ఇప్పటివరకు నిఘాకు చిక్కకుండా ఎన్నో దుశ్చర్యలు చేసినట్లు అనుమానిస్తోంది భారత ఇంటెలిజెన్స్ విభాగం. ఇలా జవాన్లు, ఉగ్రవాదులతో కలిపి ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఎక్కువ రోజులు కాలం వెళ్లదీయలేదని వార్నింగ్ ఇస్తోంది భారత్. అన్ని ఆధారాలతో పాక్ ప్రతి దుశ్చర్యను ప్రపంచం ముందు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు భారత ఆర్మీ అధికారులు.

ట్రెండింగ్ వార్తలు