×
Ad

Muhammad Yunus: బంగ్లాదేశ్ అధినేత కండకావరం.. భారత్ ను రెచ్చగొట్టేలా.. పాక్ జనరల్ కు బహుమతిగా వివాదాస్పద మ్యాప్‌..

చైనా తన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశమని కూడా ఆయన సూచించడం విశేషం.

Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్.. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. తన తీరుతో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా.. పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారికి ఒక మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ మ్యాప్ చాలా వివాదాస్పదంగా ఉంది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో అంతర్భాగంగా చూపిస్తున్నట్లు ఆ మ్యాప్ లో ఉండటమే వివాదానికి కారణమైంది. ఈ చర్య ద్వారా మన దేశం సార్వభౌమత్వాన్ని యూనస్ పరోక్షంగా ప్రశ్నించారని అనే విమర్శలు వస్తున్నాయి.

పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఢాకాలో పర్యటించారు. యూనస్‌తో భేటీ అయ్యారు. అనంతరం యూనస్ సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫొటోలు పెట్టారు. వాటిలో పాక్ జనరల్‌కు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్న చిత్రం ఉంది. ఆ పుస్తకం కవర్ పై ఉన్న మ్యాప్‌లో భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించారు. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ వాదనకు బలం చేకూర్చేలా ఉంది.

ఈ ఫొటో బయటకు రావడంతో యూనస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత సార్వభౌమాధికారంలోకి ఆహ్వానం లేకుండా అడుగుపెట్టినందుకు తాత్కాలిక బంగ్లాదేశ్ చీఫ్‌ను సోషల్ మీడియాలో విశ్లేషకులు, జర్నలిస్టులు విమర్శించారు. కాగా, ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.

అయితే, యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడం ఇది మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా విదేశీ కార్యకలాపాలలో ఈశాన్య రాష్ట్రాల గురించి పదేపదే ప్రస్తావించారు. ఏప్రిల్‌లో తన తొలి చైనా పర్యటన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర సంరక్షకులు మేమే ని ప్రకటించడం ద్వారా యూనస్ భారత్ కు కోపం తెప్పించారు. చైనా తన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశమని కూడా ఆయన సూచించడం విశేషం.

Also Read: బంగ్లాదేశ్ అధినేత కండకావరం.. భారత్ ను రెచ్చగొట్టేలా.. పాక్ జనరల్ కు బహుమతిగా వివాదాస్పద మ్యాప్‌..