Russia Nuke Missile: రష్యా మరో సంచలనం.. ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..
ప్రపంచంలో మరెవరి దగ్గరా లేని ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇది అని అన్నారు. ఎలాంటి రక్షణ కవచాన్ని అయినా ఛేదించగలదన్నారు.
Russia Nuke Missile: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణుశక్తితో పని చేసే క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించగల ఈ అస్త్రం త్వరలో సైనిక మోహరింపునకు సిద్ధమవుతుందన్నారు. ఈ మిస్సైల్ పేరు బురెవెస్ట్నిక్. అణుశక్తితో పని చేసే క్రూయిజ్ క్షిపణి. 14వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్ ఇది.
పరీక్ష సమయంలో ఈ మిస్సైల్ అణుశక్తితో ఏకధాటిగా 15 గంటల పాటు గాల్లో ప్రయాణించిందని, మొత్తం 140 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుందని రష్యా సైనిక దళాల చీఫ్ ఆఫ్.. అధ్యక్షుడు పుతిన్‌కు వివరించారు. ఈ క్షిపణికి దాదాపు అపరిమితమైన పరిధి ఉందని, దాని ప్రయాణ మార్గాన్ని అంచనా వేయడం అసాధ్యమని ఆయన తెలిపారు.
నాటో దేశాలు ‘SSC-X-9 స్కైఫాల్’ అని పిలుస్తున్న ఈ న్యూక్ మిస్సైల్ గురించి పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మరెవరి దగ్గరా లేని ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇది అని అన్నారు. ఎలాంటి రక్షణ కవచాన్ని అయినా ఛేదించగలదన్నారు. ఒకప్పుడు ఇలాంటి క్షిపణి తయారీ అసాధ్యమని మా నిపుణులే చెప్పారు. ఇప్పుడు కీలకమైన పరీక్షలు పూర్తయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాన్ని మోహరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సైనిక దళాల చీఫ్ కు ఆదేశించారు పుతిన్.
2001లో యాంటీ-బాలిస్టిక్ మిస్సైల్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, నాటో కూటమిని విస్తరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా 2018లోనే పుతిన్ ఈ క్షిపణి గురించి తొలిసారి ప్రకటించారు.
గత వారం అణు విన్యాసాలు.. ఇప్పుడు అణుశక్తితో నడిచే మిస్సైల్ పరీక్ష.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు రష్యా పంపుతున్న బలమైన సంకేతంగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సమాచారం అందిస్తున్న తరుణంలో.. రష్యాపై దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చేందుకే ఈ పరీక్షను నిర్వహించినట్లు విశ్లేషిస్తున్నారు.
USలోని లక్ష్యాలను సైతం చేరుకోగలదు..
అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి బ్యూరెవెస్ట్నిక్.. అణు చోదకం వార్‌హెడ్ సామర్థ్యాలను కలిగుంది. ఇది దాదాపు అపరిమిత పరిధిని కలిగి ఉంది. అధునాతన క్షిపణి నిరోధక రక్షణలను తప్పించుకునే సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణిని USలోని లక్ష్యాలను సైతం చేరుకోగలుగుతుందని ఇన్ స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS) తెలిపింది.
ఈ మిస్సైల్ ప్రయోగానికి ఒక సంప్రదాయ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఆపై స్థిరమైన ప్రొపల్షన్ కోసం గాలిని సూపర్ హీట్ చేయడానికి ఒక చిన్న అణు రియాక్టర్‌ను యాక్టివేట్ చేస్తుంది. అయితే, గణనీయమైన సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. 2016 నుండి డజనుకు పైగా పరీక్షలు పాక్షిక విజయాన్ని మాత్రమే సాధించాయని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వెల్లడించింది.
ఈ మిస్సైల్ పెద్ద పరిమాణం (12 మీటర్ల కంటే ఎక్కువ), సబ్‌సోనిక్ వేగం, రేడియోధార్మిక ఎగ్జాస్ట్ దీనిని డిటెక్ట్ అయ్యేలా చేస్తాయి. అలాగే కొన్ని స్వల్ప-శ్రేణి రక్షణలకు హాని కలిగించేలా చేస్తాయి. గతంలో పలు సబ్‌సోనిక్ రష్యన్ క్రూయిజ్ క్షిపణులు యుక్రెయిన్‌లో అడ్డగించబడ్డాయి. మొత్తంగా ఈ మిస్సైల్ రష్యా అణు త్రయాన్ని బలోపేతం చేస్తుంది. దాడి సామర్థ్యాలను పెంచుతుంది.
