Venezuela (Image Credit To Original Source)
Venezuela: వెనెజువెలా రాజధాని కారకస్‌లో ఆదివారం ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. దుకాణాలు, ఇంధన కేంద్రాలు, ఇతర వ్యాపార సంస్థల్లో అధిక శాతం తెరుచుకోలేదు. వెనెజువెలాపై దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
వెనెజువెలాలో సరైన న్యాయపరమైన అధికారాల బదిలీ జరిగే వరకు, అలాగే ఆ దేశం సురక్షితంగా మారే వరకు వెనెజువెలాను అమెరికానే పాలిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలోనే వెనెజువెలాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కారకస్‌లో రోడ్లపై వాహనాలు కూడా చాలా తక్కువగా తిరిగాయి.
నికోలాస్ మడురో ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలుగా ఉన్న డెల్సీ రోడ్రిగెస్‌కు ప్రస్తుతం అమెరికా మద్దతు ఉన్నట్టు సమాచారం. రాజ్యాంగ ప్రకారం ఆమెను సుప్రీంకోర్టు తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. అయినా దేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇకపై ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టత లేదు.
మరోవైపు, శనివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే దుకాణాలు, పెట్రోల్ పంపుల ముందు క్యూలు కనిపించాయి. దేశంలో అల్లర్లు చెలరేగితే నిత్యావసరాలు లేకుండా పోతాయనే భయంతో ప్రజలు సరుకులు నిల్వ చేసుకున్నారు.
ఆదివారం నాటికి మాత్రం ఆ పరిస్థితి కాస్త మారింది. కొన్ని చోట్ల క్యూలు కనిపించాయి. అధ్యక్ష భవనం వద్ద సాయుధ పౌరులు, కొందరు సైనికులు ఉండి భద్రత కల్పిస్తున్నారు.
కారకస్ సమీపంలోని లా గ్విరా ప్రాంతంలో అమెరికా ఆపరేషన్ వల్ల ధ్వంసమైవాటిని అక్కడి కుటుంబాలు శుభ్రం చేస్తూ కనపడ్డాయి. కొన్ని భవనాల గోడల్లో పెద్ద రంధ్రాలు కనిపించాయి.
నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్నందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. వీధులు ఖాళీగా ఉండటానికి కారణం.. అమెరికా మరో సైనిక దాడి చేస్తుందన్న భయం కాదని, సంబరాలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతుందన్న భయం ప్రజల్లో ఉందని పలువురు చెప్పారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ప్రజలను అణచివేసిన తీరును పలువురు గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో వెనెజువెలాలోని పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఇక్కడి నాయకులు సరైన నిర్ణయం తీసుకుంటే కలిసి పనిచేయడానికి సిద్ధమని అమెరికా ప్రభుత్వం తెలిపిందన్నారు.