×
Ad

న్యూయార్క్‌ నగర మేయర్‌గా ఎన్నికైన మమ్దానీ వెనుక ఆయన భార్య.. ఆమె ఎవరో తెలుసా? వారిద్దరి పరిచయమే ఓ తీయని కల..

రాజకీయ దృష్టితో చూస్తే దువాజీ “రాజకీయ నాయకుడి భార్య”గా కనిపించదు. ఆమె అరుదుగానే ప్రజల్లో కనిపించారు. 2021లో డేటింగ్‌ యాప్‌లో మమ్దామీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత..

Rama Duwaji: “ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది” అని అంటారు. న్యూయార్క్‌ నగర మేయర్‌గా ఎన్నికై భారత సంతతి నేత జోహ్రాన్‌ మమ్దానీ చరిత్ర సృష్టించడం వెనుక కూడా ఆయన భార్య రామా సవాఫ్‌ దువాజీ ఉన్నారు.

జోహ్రాన్‌ మమ్దానీ పేరు చెబితే ఆయన ఓ యువకుడు, ముస్లిం, వలసదారుల కుమారుడు, డెమోక్రటిక్‌ సోషలిస్టు అని చెబుతారు. ఆయనను గెలిపించింది ఈ అంశాలే కాదు. జోహ్రాన్‌ మమ్దానీ విజయం వెనుక రామా సవాఫ్‌ కృషి ఎంతగానో ఉంది. ఇకపై ఆమెను న్యూయార్క్‌ నగర “జెన్‌ జీ ఫస్ట్‌ లేడీ”గా పేర్కొంటారు.

సిరియన్‌ కళాకారిణి అయిన రామా సవాఫ్‌ దువాజీ 1997లో జన్మించారు. ఆమె ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ, మీడియాలో, సోషల్‌ మీడియాలో ఆమెకు మంచి పేరు ఉంది. దువాజీ ఒక చిత్రకారిణి, యానిమేటర్‌. ఆమె కళల్లో రాజకీయ దృక్కోణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశమే ఆమెను ప్రజలకు దగ్గర చేసింది.

కొన్ని రోజుల క్రితం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక యానిమేషన్‌ గాజా ప్రజల ఆకలి మరణాలను చూపించింది. “నేను దీన్ని సృష్టిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ గాజాపై నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది” అని పేర్కొన్నారు.

Also Read: బంగారం కొంటున్నారా? ఆభరణాల విక్రయాలు పడిపోయాయని మీకు తెలుసా? ఇవి తెలుసుకోవాల్సిందే..

ఆమె తరచుగా ది న్యూయార్కర్, న్యూయార్క్‌ మేగజైన్‌ ది కట్‌ వంటి పత్రికలకు తన చిత్రాలను పంపేవారు. ఆమె బొమ్మలను విజువల్‌గా వివరించే కథనాలుగా ఉంటాయి. అవి ప్రజల అనుభవాలను కూడా ప్రతిబింబిస్తాయి.

ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నా కళ నా చుట్టూ జరుగుతున్నదానికి ప్రతిబింబం. ఇప్పుడు కళాకారిణిగా ఉన్నంత బాధ్యత అమెరికా పౌరురాలిగానూ ఉంది. అమెరికా, పాలస్తీనా, సిరియాలో జరుగుతున్నదానిపై మాట్లాడటమే నా విధి” అని అన్నారు. ఆమెను కొంతమంది “న్యూయార్క్‌ ప్రిన్సెస్‌ డయానా”గా కూడా పిలిచారు.

రాజకీయ దృష్టితో చూస్తే దువాజీ “రాజకీయ నాయకుడి భార్య”గా కనిపించదు. ఆమె అరుదుగానే ప్రజల్లో కనిపించారు. తాను వేసే చిత్రాల్లో ఆమె స్త్రీ సాధికారతపైనే దృష్టి ఎక్కువ పెట్టేవారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మమ్దానీకి ఉపయోగపడింది. 2021లో డేటింగ్‌ యాప్‌లో మమ్దామీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. దుబాయ్‌లో2024లో పెళ్లి జరిగింది.