బంగారం కొంటున్నారా? ఆభరణాల విక్రయాలు పడిపోయాయని మీకు తెలుసా? ఇవి తెలుసుకోవాల్సిందే..
ఆభరణాల కొనుగోళ్లు తగ్గించినప్పటికీ భారతీయులు బంగారం పెట్టుబడిని ఆర్థిక రూపంలో పెంచారు. 2025 సెప్టెంబర్ నాటికి బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్‌లు) ఆస్తుల పరిమాణం రూ.90,136 కోట్లకు చేరింది.
Gold: భారతదేశానికి దీర్ఘకాలిక గోల్డ్ పాలసీ అవసరమని ఎస్‌బీఐ రీసెర్చ్ స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4,000 డాలర్లకు చేరువవుతుండటంతో భారత్‌కు ఇది సమస్యగా మారింది. ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు బంగారం నిల్వల విలువ పెరిగినా, దేశీయ డిమాండ్ తగ్గింది.
సరఫరాలో దిగుమతుల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, ఈ పెరుగుదల సార్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు)పై ప్రభుత్వ నష్టాలను కూడా పెంచింది. అంటే ధరల పెరుగుదల రికార్డు విలువలున్నప్పటికీ ఆర్థిక ఒత్తిడిని తెచ్చింది. (Gold)
ధరల పెరుగుదల.. డిమాండ్ తగ్గుదల
“కమింగ్ ఆఫ్ (ఎ టర్బ్యులెంట్) ఏజ్: ది గ్రేట్ గ్లోబల్ గోల్డ్ రష్” నివేదిక ప్రకారం.. 2025లో బంగారం ధరలు సంవత్సర ఆరంభం నుంచి 50% పెరిగాయి. దీనికి జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత కారణం. దీని ఫలితంగా రిజర్వ్ బ్యాంకు బంగారం నిల్వలు సుమారు 880 టన్నులకు చేరి, ఆర్థిక ఏడాది-25లో 25 బిలియన్ డాలర్ల పెరుగుదల తర్వాత ఆర్థిక ఏడాది-26లో మరో 27 బిలియన్ డాలర్ల మేర విలువ పెరిగాయి.
అయితే, ఈ పెరుగుదల వినియోగదారుల కొనుగోలు ఆసక్తిని తగ్గించింది. ప్రపంచ బంగారం మండలి గణాంకాల ప్రకారం.. 2025 మూడవ త్రైమాసికంలో భారత్ బంగారం డిమాండ్ సంవత్సరానికి 16% తగ్గింది. ఆభరణాల విక్రయాలు 31% పడిపోయాయి. ఈ మందగమనం ఉన్నప్పటికీ, 2024లో 802.8 టన్నుల డిమాండ్‌తో భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా నిలిచింది.
దిగుమతులు లోటును భర్తీ చేస్తున్నాయి. ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో కొత్త బంగారం నిల్వలు గుర్తించినప్పటికీ, 2024లో దిగుమతులపై ఆధారపడటం 86%గా కొనసాగిందని నివేదిక పేర్కొంది. 2025 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య బంగారం దిగుమతుల విలువ 26.5 బిలియన్ డాలర్లు (రూ.2.2 లక్షల కోట్లు)గా ఉండగా, గత సంవత్సరం ఇది 29 బిలియన్ డాలర్లు.
నివేదిక ప్రకారం, బంగారం ధరలు, అమెరికా డాలర్-రూపాయి మారకపు విలువల మధ్య సంబంధం 73%కు పెరిగింది. అంటే బంగారం ధరల పెరుగుదల ప్రతి సారి రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది.
దీని అర్థం, బంగారం ధరలు పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అదే సమయంలో బంగారం ధరలు తగ్గినప్పుడు రూపాయి బలపడుతుంది.
సార్వభౌమ బంగారం బాండ్లపై ఆర్థిక భారం
బంగారం ధరల పెరుగుదల సార్వభౌమ బంగారం బాండ్లపై (ఎస్‌జీబీలు) కలిగిస్తున్న ఆర్థిక ప్రభావం ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికలో ప్రధాన అంశంగా ఉంది. 2015-16లో భౌతిక బంగారం డిమాండ్ తగ్గించటానికి, గృహాల్లో నిల్వగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వినియమంలోకి తీసుకురావటానికి ప్రారంభించిన ఈ పథకం, ఇప్పుడు ప్రభుత్వానికి భారీ భారంగా మారింది.
ఆభరణాల కొనుగోళ్లు తగ్గించినప్పటికీ..
ఆభరణాల కొనుగోలు తగ్గించినప్పటికీ భారతీయులు బంగారం పెట్టుబడిని ఆర్థిక రూపంలో పెంచారు. 2025 సెప్టెంబర్ నాటికి బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్‌లు) ఆస్తుల పరిమాణం రూ.90,136 కోట్లకు చేరింది. ఇది సంవత్సరానికి 165% పెరుగుదల. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు గత ఏడాదితో పోల్చితే 2.6 రెట్లు పెరిగాయి.
నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చైనా బంగారం విషయంలో మంచి వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. కేంద్ర బ్యాంకు నిల్వలను పెంచి, దిగుమతి నియంత్రణలను సడలించి, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ బంగారం వాణిజ్య కేంద్రంగా నిలిచింది. భారతదేశం మాత్రం దిగుమతులపై ఆధారపడుతూ, బంగారాన్ని తన విస్తృత ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా ఏకీకరించలేకపోతోంది.
