Rishi Sunak : భారతీయ మూలాలున్న రిషి సునక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 42 ఏళ్ల సునక్ బ్రిటీష్ ప్రధాని పీఠం ఎక్కిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలించబోతున్నాడు. దీపావళి పండుగ రోజున 130 కోట్ల భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ అందించారు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ విర్రవీగిన తెల్లదొరలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయ్యారు. భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం. బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు రిషి. ఈ సందర్భంగా రిషి సునక్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.
ఎవరీ రిషి సునక్.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి?
రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. రిషి సునక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి. వారి పూర్వీకులు టాంజానియా, కెన్యా వలస వెళ్లినట్టు తెలుస్తోంది. ఉష, యశ్వీర్ టాంజానియా, కెన్యా దేశాల నుంచి బ్రిటన్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్‌వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలస వెళ్లాక వివాహం చేసుకున్నారు. సునక్ తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు. ఉష, యశ్వీర్ దంపతులకు ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు.
రిషి సునక్ తండ్రి యశ్వీర్ ఓ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రిషి సునక్ 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు. కొత్త తరం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు.
రిషి సునక్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించి సత్తా చాటుకున్నారు. థెరెస్సా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు.
బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ పౌండ్ల సంపద ఉన్నట్టు అంచనా. ఆయన క్రికెట్, ఫుట్ బాల్, సినిమాలు అంటే ఇష్టం. ఫిట్ నెస్ పై మక్కువ చూపిస్తారు.
స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గెలిచినప్పుడు బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులలో ఒకరిగా రిషి సునక్ గుర్తింపు పొందారు.
ఆయనను ప్రజలు ముద్దుగా ‘డిషీ రిషి’ అని పిలుచుకునేవారు. కరోనా మహమ్మారి సమయంలో రిషి సునక్ రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా ఆయనకు మరింత ప్రజాదరణ దక్కింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కర్ణాటకు చెందిన ఎన్‌ఆర్ నారాయణ, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని రిషి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.