లండన్‌లో లక్షలాది మంది నిరసనలు.. ఇప్పటివరకు ఏం జరిగింది? వారి వెనకున్న టామీ రాబిన్‌సన్ ఎవరు?

రాబిన్‌సన్ బ్రిటిష్ రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తి. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన రాబిన్‌సన్‌.. వలసల వ్యతిరేక, ఇస్లాం వ్యతిరేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

Anti-immigration rally: వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఫార్ రైట్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ నేతృత్వంలో శనివారం యాంటీ ఇమిగ్రెంట్ “యునైట్ ద కింగ్డమ్” ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. ఫార్ రైట్ అంటే కఠిన జాతీయవాదం, వలస వ్యతిరేక భావజాలం కలిగిన రాజకీయ పంథా.

రైళ్లు, బస్సులలో లండన్ చేరుకుని మరీ చాలా మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. దీన్ని “ఫెస్టివల్ ఆఫ్ ఫ్రీ స్పీచ్”గా పిలిచారు. అయితే, ఈ ర్యాలీలో చేసిన ప్రసంగాల్లో జాత్యహంకార కుట్ర సిద్ధాంతాలు, యాంటీ ముస్లిం వ్యాఖ్యలు వినపడ్డాయని “ది గార్డియన్” పత్రిక తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు అధికారులను ఆందోళనకారులు కొట్టారు. “యునైట్ ద కింగ్డమ్” ర్యాలీ వేల 1,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. అంతేగాక, అదనంగా హెల్మెట్లు, రయట్ షీల్డ్స్ ధరించిన బలగాలను కూడా అక్కడకు పంపారు.

పోలీసుల అంచనా ప్రకారం ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య 1,10,000 నుంచి 1,50,000 మధ్య ఉంటుంది. 2023 నవంబర్ లో జరిగిన ప్రో-పాలస్తీనా ర్యాలీలో సుమారు 300,000 మంది వచ్చారు. దానితో పోల్చితే మాత్రం నిన్న జరిగింది చిన్న ర్యాలీనేనని అధికారులు అన్నారు. (Anti-immigration rally)

రాబిన్‌సన్ మాట్లాడుతూ.. “మైగ్రెంట్లు కోర్టుల్లో బ్రిటిష్ ప్రజల కంటే అధికంగా హక్కులు పొందుతున్నారు. ఈ దేశాన్ని నిర్మించిన ప్రజలకు హక్కులు తక్కువయిపోయాయి” అని అన్నారు. లండన్‌లో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఎథియోపియన్ వ్యక్తికి శిక్ష విధించిన అనంతరం ఈ నిరసనలు మరింత పెరిగాయి. కొన్ని నిరసనల్లో హింస జరిగి, అరెస్టులు జరిగాయి.

Also Read: నేను శివభక్తుడిని, ఇలాంటి విషాన్ని మింగేస్తాను: ప్రధాని మోదీ

శనివారం జరిగిన ర్యాలీని ఆయన డిఫెన్స్‌ ఆఫ్‌ ఫ్రీ స్పీచ్ అని అన్నారు. అయితే, యూరప్ ఫార్ రైట్ రాజకీయ నేతలు ఇచ్చిన సందేశంలో అధిక శాతం మైగ్రేషన్ చుట్టూ తిరిగింది. “సౌత్‌ నుంచి వచ్చిన ప్రజలతో, ముస్లిం సంస్కృతితో మన యూరోపియన్ ప్రజలు రీప్లేస్ అవుతున్నారు” అని ఫ్రెంచ్ రాజకీయ నాయకుడు ఎరిక్ జెమూర్ అన్నారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ యూకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “బ్రిటిష్ వ్యక్తిగా ఉండటంలో ఒక అందం, గర్వకారణం, ప్రత్యేకత ఉన్నాయి. కానీ, నేను ఇక్కడ చూసేది బ్రిటన్ నాశనం. మొదట నెమ్మదిగా జరిగింది, ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. నియంత్రణ లేని మైగ్రేషన్ కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది” అని అన్నారు. బ్రిటన్‌లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రాబిన్‌సన్ ఎవరు?

రాబిన్‌సన్ (42) అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ-లెనన్. ఆయన ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడు, బ్రిటన్‌లో ప్రముఖ ఫార్ రైట్ నేతల్లో ఒకరు. రాబిన్‌సన్ బ్రిటిష్ రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తి. ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన రాబిన్‌సన్‌.. వలసల వ్యతిరేక, ఇస్లాం వ్యతిరేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.

ది గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో ఫార్ రైట్ శక్తులను సమీకరించడానికి, రిఫార్మ్ యూకే మాజీ సభ్యులు ప్రారంభించిన కొత్త రాజకీయ పార్టీ అడ్వాన్స్ యూకేతో రాబిన్‌సన్ చేతులు కలుపుతున్నారు.

గత అక్టోబర్‌లో ఒక సిరియన్ శరణార్థిపై తప్పుడు ఆరోపణలు చేశారు. అటువంటివి మళ్లీ చేయవద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని లెక్కచేయకుండా రాబిన్‌సన్ వ్యవహరించడంతో జైలులో శిక్ష అనుభవించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన జైలునుంచి విడుదలయ్యారు.