కరోనా పుట్టినిల్లు వుహాన్‌కు WHO సైంటిస్టులు.. అసలు వైరస్ మూలం ఎక్కడో తేల్చేస్తాం!

WHO Send scientists to investigate Covid virus origins in China’s Wuhan : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి పుట్టుకకు మూలం ఎక్కడో తేల్చేయబోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). కరోనా పుట్టినిల్లు చైనాలో వుహాన్ అంటూ ప్రపంచమంతా భావిస్తోంది. అదే నిజమని నమ్ముతోంది. అసలు వాస్తవాలేంటి? నిజంగా కరోనాకు మూలం వుహాన్ సిటీనా? కరోనా నిగ్గు తేల్చేందుకు కోవిడ్ -19 మూలాలు పరిశోధించడానికి 10 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందాన్ని వుహాన్ సిటీకి పంపుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వచ్చే నెలలో చైనా నగరమైన వుహాన్‌లో పర్యటిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ మిషన్‌కు WHO నేతృత్వం వహించనుంది.
మహమ్మారికి కారణమైన వైరస్ ఎక్కడ ప్రారంభమైందో దర్యాప్తు చేయడానికి జనవరి మొదటి వారంలో చైనాకు అంతర్జాతీయ మిషన్‌ బృందం వెళ్లే అవకాశం ఉంది.  అయితే గతంలో కరోనాకు మూలాన్ని అన్వేషించేందుకు స్వతంత్ర విచారణకు బీజింగ్ విముఖత చూపింది. అప్పటినుంచి WHO వుహాన్ సిటీలోకి ప్రవేశించేందుకు చాలా నెలల సమయం పట్టింది.ఈ వైరస్ జంతువులను విక్రయించే నగరంలోని వుహాన్ మార్కెట్ నుంచే వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ మూలాన్ని అన్వేషించే క్రమంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాతో చైనాకు వైరుధ్యానికి దారితీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. చైనా కరోనా ప్రారంభ వ్యాప్తిని దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
“పారదర్శకంగా అన్వేషణ కొనసాగాలని WHO నేతృత్వంలోని దర్యాప్తుకు అమెరికా పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను సైతం అమెరికా విమర్శించింది. దాంతో చైనా సైంటిస్టులకు WHO మొదటి దశ ప్రాథమిక పరిశోధన చేయడానికి అనుమతించింది. మధ్య చైనాలోని వుహాన్‌లో న్యుమోనియా కేసులను చైనా డిసెంబర్ 31న WHOకు నివేదించింది. కరోనావైరస్ ఉద్భవించిందని నమ్ముతున్న వుహాన్ మార్కెట్‌ను మూసివేసింది. ఇప్పుడు WHO తమ సైంటిస్టుల బృందాన్ని వుహాన్ సిటీకి పంపుతోంది.
ఆరు వారాల పాటు కొనసాగే అంతర్జాతీయ మిషన్‌లో భాగంగా WHOకి చెందిన 12 నుంచి 15 అంతర్జాతీయ నిపుణుల బృందం వుహాన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది. వుహాన్ వెళ్లి చైనా పరిశోధకులు సేకరించిన మానవ జంతు నమూనాలతో సహా సాక్ష్యాలను పరిశీలించి అధ్యయనాలను రూపొందించడానికి సన్నద్ధమవుతోంది. న్యూ ఇయర్ తరువాత WHO సైంటిస్టుల బృందం వుహాన్ నగరానికి బయలుదేరనుంది. అంతర్జాతీయ బృందం వీలైనంత త్వరగా చైనా వెళ్లేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లలో నిమగ్నమైంది. జనవరి 18న WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రారంభానికి ముందుగానే సైంటస్టుల బృందం వుహాన్ సిటీకి బయలుదేరనుంది. కరోనా వైరస్ మూలాన్ని తేల్చేయడమే లక్ష్యంగా అన్వేషణ కొనసాగనుంది.

ట్రెండింగ్ వార్తలు