యూఏఈ దిర్హాంతో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియా ఉన్న ప్రవాస భారతీయులు భారీగా తమ సొంత దేశానికి డబ్బులు పంపిస్తున్నారు. రూపాయి విలువ ఏఈడీకి రూ.23.5 (ఏప్రిల్ ప్రారంభం తర్వాత కనిష్ఠ స్థాయి) వరకు పడిపోయింది.
గల్ఫ్ న్యూస్ పేర్కొన్న వివరాల ప్రకారం.. జూన్ 19 నుంచి గల్ఫ్ దేశాలలోని కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో ఏఈడీ-ఐఎన్‌ఆర్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం.. ప్రవాసులు ఇక ఎక్స్చేంజ్ రేట్లు ఇంకా తగ్గుతాయని ఎదురు చూడకుండా, తమ వద్ద అదనంగా ఉన్న నగదును వెంటనే స్వదేశానికి పంపించేస్తున్నారు.
యూఏఈ ఎక్స్చేంజ్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. “గత గురువారం రూపాయి ఒక దశలో రూ.23.46కి బలపడినా కూడా చాలా మంది ప్రవాసులు డబ్బులు పంపించడంపై ఆసక్తి కనబర్చారు” అని చెప్పారు.
సాధారణంగా జూన్‌లో భారతీయ ప్రవాసుల రిమిటెన్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేసవి సెలవులు, ప్రయాణ ఖర్చుల కారణంగా అదనపు భారాలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు మారాయి.
ఎక్స్చేంజ్ సంస్థల ప్రతినిధుల అభిప్రాయం మేరకు.. జులై వరకు రూపాయి బలహీనంగా ఉంటే, ఇది డబ్బులు పంపే వారికి లాభమే. ఇలాగే మారకపు రేట్లు స్థిరంగా ఉన్నా లేదా మరింత తగ్గినా రెండు విధాలా లాభమేనన్నారు.
ఈ పరిస్థితులు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల చోటుచేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు అమెరికా డాలర్ వైపు మొగ్గుచూపుతారు. కానీ ఈసారి డాలర్ బలహీనంగా ఉండటంతో, బంగారమే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది. ఇది రూపాయి మీద ప్రతికూల ప్రభావాన్ని కొంత తగ్గించింది.