ట్రంప్‌ పర్యటనలో అమ్మాయిలు జుట్టు ఊపుతూ ఇలా ఎందుకు డ్యాన్స్ చేశారు?

తమ జుట్టును కుడి నుంచి ఎడమవైపునకు, ఎడమ నుంచి కుడివైపునకు తిప్పుతారు.

ఖతార్‌ పర్యటనను ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అబుదాబిలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమంలో ట్రంప్‌కు మహిళలు స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూఏఈ అధ్యక్ష భవనం ఖాసర్ అల్ వతన్‌లో ట్రంప్ ముందు మహిళలు “అల్ అయ్యాలా” సాంస్కృతిక కళారూపాన్ని ప్రదర్శించారు. మహిళలు తమ జుట్టును కుడి నుంచి ఎడమవైపునకు, ఎడమ నుంచి కుడివైపునకు తిప్పుతారు. అదే సమయంలో చాలా మంది పురుషులు కత్తి లాంటి పదునైన ఆయుధాన్ని ఊపుతూ కనిపించారు.

Also Read: వల్లభనేనిపై మరో రెండు కేసులు..ఇప్పట్లో బెయిల్ రానట్లేనా?

యునెస్కో వివరాల ప్రకారం.. అల్ అయ్యాలా అని పిలిచే ఈ సాంస్కృతిక ప్రదర్శనలో కవిత్వం చదవడం, డ్రమ్ మ్యూజిక్, నృత్యం ఉంటాయి. సాంప్రదాయ దుస్తులు ధరించిన అమ్మాయిలు తమ పొడవాటి జుట్టును అటూ ఇటూ కదిస్తూ వరుసగా నిలబడతారు. అలాగే, 20 మంది పురుషులు ఆ మహిళల వెనకాల నిలబడతారు.

ఈ నృత్యాన్ని సాధారణంగా ఒమన్, యూఏఈలో వివాహాలు, పండుగల సమయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేవారిలో విభిన్న వర్గాలు, వయస్సులకు చెందినవారు ఉంటారు. వారిలో లీడ్ పర్ఫార్మర్‌ వారసత్వంగా వచ్చిన పాత్రను పోషిస్తాడు. ఇతర ప్రదర్శనకారులకు అతడే శిక్షణ ఇస్తాడు. అల్ అయ్యాలా ప్రదర్శనలో అన్ని వయసులవారు, సామాజిక తరగతుల వారు ఉంటారు.