Saudi Arabia Prince (Photo: X/ Google Images )
Saudi Arabia Prince : అదో సౌదీ అరేబియా రాజకుటుంబం.. ఈ రాజకుటుంబాలు ఆడంబర జీవితంలో గడిపేస్తుంటారు. బ్రిటన్ రాజకుటుంబం, సౌదీ అరేబియా రాజకుటుంబం అయినా ఇప్పటికీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా రాజకుటుంబాల జీవితాలు విలాసాలతో నిండి ఉంటాయి. ఎన్నో రాజభోగాలను అనుభవిస్తుంటారు.
కానీ, ఆ రాజభవనాల జీవితాల వెనుక కొన్ని విషాధ గాథలు కూడా ఉంటాయి. అందులో అత్యంత హృదయ విదారకమైన కథ సౌదీ అరేబియా యువరాజు అల్-వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్.. ఈయన్ను ఇప్పుడు ‘స్లీపింగ్ ప్రిన్స్’గా పిలుస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన కోమాలోనే ఉన్నారు. ఆయన ఎందుకు ఇలా ఉండిపోయారు అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ప్రిన్స్ జీవితం అంధకారంలోకి :
ప్రిన్స్ అల్-వలీద్ 36వ పుట్టినరోజును ఏప్రిల్ 18, 2025న జరుపుకున్నారు. కానీ, చాలా ఏళ్లుగా ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ, ప్రిన్స్ ‘స్లీపింగ్ ప్రిన్స్’గా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే.. గత 20 ఏళ్లుగా ప్రిన్స్ వాలిద్ కోమాలోనే ఉన్నాడు.
ఊహించని ఒక పెనుప్రమాదం ప్రిన్స్ అల్-వాలిద్ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. 2005లో భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఇలా కోమాలో ఉండిపోయారు. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు ఆర్మీ కాలేజీలో చదువుతున్నాడు. ప్రమాదం తర్వాత పూర్తిగా మంచానికే పరిమితం కావడం రాజ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రిన్స్ అల్-వాలిద్ ఎవరు? :
ప్రిన్స్ అల్-వలీద్ సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు రాజు అబ్దులాజీజ్ మునిమనవడు. ఆయన తండ్రి, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్.. రాజు అబ్దులాజీజ్ కుమారుడు ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ కుమారుడు. యువరాజు అల్-వలీద్ సౌదీ రాజకుటుంబానికి బంధువు. అయితే, ఆయన ప్రస్తుత రాజుకు ప్రత్యక్ష వారసుడు కాదు.
ఇప్పుడు ప్రిన్స్ కోమాలో ఉన్నారు. రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలో మంచానికే పరిమితం అయ్యారు. గత 20 ఏళ్లు ప్రిన్స్ వాలిద్ ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రిన్స్ అల్-వలీద్ గత 20 ఏళ్లుగా వెంటిలేటర్‌పై ఉన్నారని, ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారని రోయా న్యూస్ నివేదించింది.
2019లో శరీర కదలికలు కనిపించినా.. :
చివరిసారిగా 2019లో ప్రిన్స్ శరీరంలో కదలికలు మొదలయ్యాయి. ఆయన చిన్న సైగలతో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన వేలు పైకెత్తి తల కొద్దిగా ఊపాడు. కానీ, ప్రిన్స్ స్పృహలోకి వచ్చినందుకు సంకేతం కాదని వైద్యులు చెబుతున్నారు.
రాజ కుటుంబం అల్ వాలిద్ మళ్ళీ కోమా నుంచి తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. వైద్యులు లైఫ్ సపోర్ట్‌ను నిలిపివేయమని చెప్పేశారు. కానీ, తండ్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ అందుకు అంగీకరించలేదు. ఎప్పటికైనా తన కొడుకు తిరిగి లేస్తాడని బలంగా విశ్వసిస్తున్నారు.