Pahalgam Terror Attack: ఇండియా vs పాకిస్థాన్.. యుద్ధం వస్తే అమెరికా ఎటువైపు? ఎటాక్ పై ట్రంప్ ఏమన్నారంటే..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

US President Donald Trump

Pahalgam terror attack: జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ హెచ్చరించారు. అంతేకాదు.. పాకిస్థాన్ ను అన్నివైపుల నుంచి దెబ్బకొట్టేలా భారత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.

Also Read: India vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తుందా..? ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయంటే..?

పహల్గాంలో ఉగ్రదాడి ఘటనను పలు దేశాలు ఖండించాయి. అమెరికా, రష్యాతోపాటు పలు దేశాలు భారత్ కు సంఘీభావం తెలిపాయి. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ట్విటర్ వేదికగా భారతదేశానికి తమ బలమైన మద్దతును అందిస్తామని చెప్పారు. భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాదదాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా భారత్ కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఉగ్రవాదపై పోరులో భారత్ కు అండగా ఉంటామని చెప్పారు. ఈ ఘటన సమయంలో భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షులు జెడీ వాన్స్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా నుంచి భారత్ కు పెద్దెత్తున మద్దతు లభిస్తున్న తరుణంలో.. పాకిస్థాన్ దేశంపై భారత్ సైనిక చర్యకుదిగితే అమెరికా నుంచి భారత్ కు ఏ స్థాయిలో సహకారం అందిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఇండియా, పాక్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి సత్తా ఎంత? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్… ఎవరి వద్ద ఎన్ని?

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశంకు అమెరికా బలమైన మద్దతును ప్రకటించినప్పటికీ.. పాకిస్థాన్ పై భారతదేశం సైనికచర్యను ప్రారంభిస్తే అమెరికా సహకారం అందించే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే.. రెండు దేశాల మధ్య అణు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సమన్వయం, చర్చలకోసం అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. 2019 పుల్వామా దాడి తరువాత కూడా.. భారతదేశం ఆత్మరక్షణ హక్కుకు అమెరికా మద్దతు తెలిపినప్పటికీ.. పాకిస్థాన్ పై భారత్ చేసే సైనిక ప్రతీకార చర్యను అమెరికా స్పష్టంగా ఆమోదించలేదు. దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మాన్ ప్రకారం.. ట్రంప్ సైనిక ప్రతీకార చర్యలకు అంగీకరిస్తారని భారతదేశం భావించకూడదని చెప్పారు.

 

తాజాగా.. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రోమ్ పర్యటకు బయల్దేరిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు.. భారత్ – పాక్ ఉద్రిక్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని అంటూ ట్రంప్ మరోసారి ఖండించారు. ‘‘మేము భారతదేశంతో మంచి సంబంధాలు కలిగిఉన్నాము.. అదే సమయంలో పాకిస్థాన్ తోనూ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్, పాక్ దేశాల మధ్య కాశ్మీర్ సమస్య చాలాకాలంగా కొనసాగుతుంది. ఎన్నోఏళ్లుగా ఆ సమస్య అలానే ఉంది.. వారు ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కరించుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.’’ అని ట్రంప్ అన్నారు. తద్వారా భారతదేశం పాకిస్థాన్ పై సైనిక చర్యకు దిగితే తాము మద్దతు ఇచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశాన్ని ట్రంప్ తెలియజేశారు.