India vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తుందా..? ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయంటే..?
1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.

India vs Pakistan War
India vs Pakistan War: పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే, గతంలో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయన్న విషయాలను ఓ సారి పరిశీలిద్దాం.
1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో ఏకీకృత పెద్ద భారతదేశంలో భాగమైన రెండు దేశాల మధ్య జరిగిన మొదటి యుద్ధం 1947లో జరిగింది. ఆ తరువాత మూడు సార్లు.. మొత్తంగా నాలుగు సార్లు ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత కూడా పలు సార్లు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.
Also Read: డెడ్‌లైన్‌లోపు మన దేశం నుంచి పాకిస్థానీయులు వెళ్లకపోతే జరిగేది ఇదే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
ఇరు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు ఘర్షణలు తలెత్తాయంటే..?
♦ 1947 నుంచి భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి.
♦ మొదటి ఇండో -పాక్ యుద్ధం (1947- 1948) మధ్య కాలంలో జరిగింది. స్వాతంత్ర్య వచ్చిన వెంటనే కాశ్మీర్ ప్రాంతం కోసం ఇరు దేశాలు తలపడ్డాయి. ఈ యుద్ధం 1947 అక్టోబర్ 21 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు కొనసాగింది. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది.
♦ రెండవ ఇండో-పాక్ యుద్ధం 1965లో జరిగింది.. పాక్ కాశ్మీర్ లోకి చొరబడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాక్ దళాలు భారత దేశం ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రత్నించాయి. దీంతో భారతదేశం పశ్చిమ పాకిస్థాన్ పై పూర్తిస్థాయి సైనిక చర్యను ప్రారంభించింది. యుద్ధం 17రోజుల పాటు జరిగింది. సోవియట్ యూనియన్, అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్థాన్ తిరుగుబాటుతో కారణమైన ఈ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించింది.
♦ 1971 ఇండో-పాక్ యుద్ధం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం).. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక కీలకమైన సంఘటన. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ సైన్యం నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ పోరాటంలో భారతదేశం వారిని మద్దతు ఇచ్చింది. ఈ యుద్ధం 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించడంతో ముగిసింది. ఆ సమయంలో భారత సైన్యం దాదాపు 15000 చదరపు కిలోమీటర్ల వరకు పాకిస్థాన్ భూభాగాన్ని ఆక్రమించింది. అయితే, ఆ భూమిని తరువాత సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌కు తిరిగి బహుమతిగా ఇచ్చింది.
♦ కార్గిల్ యుద్ధం (1999).. జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో పాకిస్థాన్ దళాలు ఆక్రమించిన భూభాగాలపై భారతదేశం తిరిగి నియంత్రణ సాధించింది. పాకిస్థాన్ దళాలు కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడ్డాయి. భారతదేశం సైనిక చర్యతోపాటు.. పాకిస్థాన్ ను దౌత్యపరంగా కూడా ఎదుర్కొంది. చొరబాటు జరిగిన రెండు నెలల్లోనే వారు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అమెరికా సహా అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచడంలో భారత్ విజయవంతం అయింది. దీంతో పెద్దెత్తున సైనిక దాడులు జరుగుతాయని భావించిన పాకిస్థాన్.. వెనక్కి తగ్గింది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ 4వేల మంది సైనికులను కోల్పోయింది. ఇది పాకిస్థాన్ కు ఎదురైన అతిపెద్ద ఓటముల్లో ఒకటి.
♦ కార్గిల్ యుద్ధం తరువాత కూడా పలు సందర్భాల్లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. 1984-2023 మధ్య సియాచిన్ ఘర్షణ, 2001- 2022 మధ్య కాలంలో భారత పార్లమెంట్ పై దాడి తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దౌత్య ప్రయత్నాల ద్వారా ఉధ్రిక్తతలు తగ్గాయి.
♦ 2016లో ఉరి దాడికి ప్రతీకారంగా భారతదేశం ఎల్ఓసీ అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.
♦ 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ ప్రాంతం బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.