డెడ్‌లైన్‌లోపు మన దేశం నుంచి పాకిస్థానీయులు వెళ్లకపోతే జరిగేది ఇదే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? వాటి సంబంధిత చట్టాలు ఏం చెబుతున్నాయి? భారత్‌లోనే పాకిస్థాన్‌ జాతీయులు ఇంకా ఉంటే ఏయే శిక్షలు పడతాయి? అన్న వివరాలను తెలుసుకుందాం..

డెడ్‌లైన్‌లోపు మన దేశం నుంచి పాకిస్థానీయులు వెళ్లకపోతే జరిగేది ఇదే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

Updated On : April 25, 2025 / 8:43 PM IST

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ జాతీయులకు భారత్‌ వీసా సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ వీసాలు ఏప్రిల్ 27 నుంచి రద్దు అవుతాయి. అలాగే, మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు చెల్లుతాయి. ఆ లోగా పాకిస్థాన్ వాళ్లు భారత్‌ నుంచి వెళ్లిపోవాలి.

ఈ తేదీల్లోగా పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లకపోతే భారతీయ చట్టాల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? వాటి సంబంధిత చట్టాలు ఏం చెబుతున్నాయి? భారత్‌లోనే పాకిస్థాన్‌ జాతీయులు ఇంకా ఉంటే ఏయే శిక్షలు పడతాయి? అన్న వివరాలను తెలుసుకుందాం..

ఈ పరిణామాలు ఎదుర్కోవచ్చు
వీసా గడువు ముగిసిన తర్వాత భారతదేశంలో ఉండటం చట్టవిరుద్ధం. ఫారినర్స్ యాక్ట్ 1946, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం దీన్ని నేరంగా పరిగణిస్తారు. నిర్దేశిత గడువులోగా వారు దేశం విడిచి వెళ్లకపోతే.. వారు చట్టవిరుద్ధంగా భారత్‌లో ఉన్నట్లే లెక్క. ఇటువంటి వ్యక్తులను “అక్రమ వలసదారులు”గా వర్గీకరించవచ్చు. వారిపై చర్యలు తీసుకోవచ్చు.

పోలీసులు ఏయే చర్యలు తీసుకుంటారు?
పాకిస్థాన్ జాతీయులు వీసా గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఉంటే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. వారిని డిటెన్షన్ సెంటర్‌లలో ఉంచవచ్చు. ఈ సెంటర్లలో ఉంచితే జైలులో ఉంచినట్లు కాదు. కానీ, డిపోర్టేషన్ వరకు విదేశీయులను ఉంచడానికి ఈ సెంటర్లను వాడతారు.

డిపోర్టేషన్: అక్రమంగా ఉన్న వ్యక్తులను వారి స్వదేశానికి బలవంతంగా డిపోర్ట్ చేయవచ్చు. డిపోర్టేషన్ ప్రక్రియలో స్థానిక పోలీసులు, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇమ్మిగ్రేషన్ అధికారులు పాల్గొంటారు.

జరిమానాలు, కేసులు: వీసా ఓవర్‌స్టే కారణంగా జరిమానాలు విధించవచ్చు. ఓవర్‌స్టే లేదా వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. ఇది ఫారినర్స్ యాక్ట్ 1946 లేదా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్, 2025 కింద జరుగుతుంది.

భవిష్యత్తులో రాకుండా నిషేధం: ఓవర్‌స్టే చేసిన వ్యక్తులు భవిష్యత్తులో భారతదేశానికి రాకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. ఈ నిషేధం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉండవచ్చు.

ఈ చట్టాల కింద చర్యలు
వీసా ఓవర్‌స్టే, అక్రమ ఇమ్మిగ్రేషన్ సంబంధిత కేసుల విషయంలో ఫారినర్స్ యాక్ట్ 1946 చట్టం సెక్షన్ 14 ప్రకారం వర్తిస్తుంది. వీసా గడువుకి మించి ఉండటం లేదా వీసా నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరంగా పరిగణిస్తారు. శిక్షగా జరిమానా, డిపోర్టేషన్, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939: ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించిన 24 గంటల్లో ఎఫ్‌ఆర్‌ఆర్‌వోలో వారి పేర్లను రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే శిక్షలు పడతాయి.

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025: ఈ కొత్త బిల్ ప్రకారం అనధికారిక ప్రవేశం లేదా వీసా ఓవర్‌స్టేకి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఫోర్జరీ డాక్యుమెంట్లు వాడి దేశానికి వస్తే 2-7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష నుండి రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది.

సిటిజన్‌షిప్ యాక్ట్, 1955 (2003లో దీన్ని సవరించారు): అక్రమ వలసదారులు రిజిస్ట్రేషన్ లేదా నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వానికి అర్హులు కాదు. వారికి 2-8 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

మెడికల్ వీసాల విషయంలో..: పాక్‌ దేశీయులకు భారత్‌లో మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 చెల్లుబాటులో ఉంటాయి. ఈ తేదీ తర్వాత ఓవర్‌స్టే చేస్తే పైన పేర్కొన్న చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.

చట్టపరమైన సాయం: చట్టపరమైన సలహా కోసం ఇమ్మిగ్రేషన్ నిపుణులు లేదా న్యాయవాదులను సంప్రదించాలి. గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్తే జరిమానాలు, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవచ్చు.