కుక్క కరవడం చాలా మందికి తెలుసు. మనిషి కరవడం పెద్దగా విని ఉండరు. ఉదయం వేళలో జాగింగ్ చేస్తున్న యువతిని ఆవేశంలో కొరికిన 19ఏళ్ల మహిళ కటకటాలపాలైంది.
కుక్క కాటు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కుక్క కరుస్తుందని అందరికి తెలుసు. అదే మనిషి కరిచినట్టు పెద్దగా విని ఉండరు. ఇప్పుడు వినండి.. చదవండి.. జాగింగ్ చేస్తున్న యువతిని 19ఏళ్ల మహిళ కరిచి కటకటాలపాలైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఈస్ట్ బే రీజనల్ పార్క్ దగ్గర జరిగింది. అసలేం జరిగిందంటే.. ఓక్లాండ్ కు చెందిన అల్మా కాడ్ వాల్లేడర్ అనే మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి పార్క్ కు వెళ్లింది. అదే సమయంలో జాగింగ్ చేసేందుకు ఓ యువతి పార్క్ కు వచ్చింది. సడన్ గా అల్మా పెంపుడు కుక్క ఆ యువతిపై దాడి చేసింది. కుక్క నుంచి తప్పించుకునేందుకు మహిళా జాగర్ తన చేతిలో పెప్పర్ ను దానిపై చల్లింది. అది చూసిన కుక్క యజమానికి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో యువతిని గట్టిగా కొరికింది.
కుక్క కాటు నుంచి తప్పించుకున్నా.. ఓనర్ కాటు నుంచి యువతి తప్పించుకోలేకపోయింది. చేతిపై పళ్లు బలంగా గుచ్చుకోవడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. చేతిపై పళ్ల అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి కుక్క ఓనర్ అల్మాపై కేసు పెట్టింది. ఓక్లాండ్ పోలీసులు అల్మాను కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అల్మేదా కౌంటీ జడ్జీ ఆదేశాల మేరకు కుక్క యజమానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనంతరం నిందితురాలిని శాంటా రీటా జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలను పోలీసు శాఖ తమ అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.