World Coconut Day 2021 : కొండంత ప్రయోజనాల కొబ్బరి

సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ప్రపంచ కొబ్బరి ఆకులు, కాయలు, పీచు, కాండం,ఆయిల్ ఇలా కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో..

World Coconut Day 2021 : సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి ప్రాముఖ్యత మరియు ఉష్ణమండల పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం. మరి ఈ ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంగా కొబ్బరి చెట్టు, కొబ్బరి కాయలు,కొబ్బరి నీళ్లు వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే ప్రతీ వనరుని ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నాం. కూల్ డ్రింకులనీ..ఎనర్జీ డ్రింకులని తాగి ఆరోగ్యాలకు చేటు తెచ్చుకుంటున్నాం. పైగా కల్తీ డ్రింకులు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాం. కానీ ఈ సమస్త సృష్టిలో కల్తీ కానివి ఏంటో తెలుసా? ఒకటి అమ్మ పాలు..రెండు కొబ్బరి నీళ్లు. అమ్మ ఇచ్చే పాలు అమృతమైతే ప్రకృతి మనకు ఇచ్చిన కొబ్బరి నీళ్లుకోటి వరలా జల్లు అని తెలుసుకోవాలి.

కొబ్బరి చెట్టులో ప్రతీది మనిషికి ఉపయోగపడేవే. కొబ్బరి ఆకులు, కాయలు, పీచు ఇలా ప్రతీది మనిషికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే కొబ్బరి రైతులకు అక్షయపాత్ర అనే చెప్పాలి.ఎందుకంటే కొబ్బరి సీజనల్ పంట కాదు.సంవత్సరం పొడవునా నిర్విరామంగా కాయలు కాస్తునే ఉంటుంది. అందుకే కొబ్బరి చెట్టుని భూలోక కల్పవృక్షం అని అంటారు.పచ్చి కొబ్బరి,ఎండు కొబ్బరి,కొబ్బరి నీళ్లు,కొబ్బరి నూనె మనిషి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది.

ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి అత్యంత విలువ కలిగినది. కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప‌చ్చి కొబ్బరిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.కొబ్బరిలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గొంతు, బ్రాంకైటిస్ స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

కొబ్బరిని క్రమం త‌ప్పకుండా తీసుకుంటే..భ‌విష్యత్తులో వ‌చ్చే అల్జీమ‌ర్స్ వంటి వ్యాధుల‌కు చెక్ పెట్టవ‌చ్చని నిపుణులు చెబుతారు. అంతేకాదు..కొబ్బరి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది.కొబ్బరిలో ఫైబ‌ర్ పుష్కలంగా ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణ వ్యవ‌స్థ మెరుగుప‌డుతుంది. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. పేగుల్లో క‌ద‌లిక‌లు బాగుంటాయి. దీంతో మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్యే రాకుండా చేస్తుంది. పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడుతోన్న వారికి ఉపశమనం లభిస్తుంది.

పొడి చ‌ర్మం, వెంట్రుక‌లు చిట్లడం వంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతోన్నవారికి కొబ్బరి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. చ‌ర్మంలో తేమ‌ను పెంచ‌డంలో కూడా కొబ్బరి కీల‌క పాత్ర పోషిస్తుంది. దీంతో చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌డుతుంది. కొబ్బరిలో ఉండే మోనోలారిన్‌, లారిక్‌ యాసిడ్‌లు యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి.

కొబ్బరి నీళ్లతో కోటి ఉపయోగాలు..
కూల్ డ్రింగ్స్ బదులు కొబ్బరి నీళ్లు తాగితే… ఆరోగ్యమే ఆరోగ్యం. ఇవి గుండెను కాపాడేస్తాయి. బాడీలో హీట్ తగ్గిస్తాయి. దాహం సమస్యను చెక్ పెడతాయి. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడినవారికి కొబ్బరి బోండాలనే ఇచ్చారు.

లేత కొబ్బరి బొండాల్లో 90 నుంచి 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవారట. మాల్దీవుల జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే… సెప్టెంబర్‌ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు.

అలాగే కొబ్బరి పీచుతో ఎన్నో కుటీర పరిశ్రమలు ఉపాధి పొందుతున్నాయి.కొబ్బరి మట్ట, కొబ్బరి ఆకులు ఇలా కొబ్బరి చెట్టులో ఉపయోగం లేనివి అంటూ ఏమీ లేవు. అందుకే కొబ్బరి చెట్టు భూలోక కల్పవృక్షం అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ట్రెండింగ్ వార్తలు