World Happiest Country : ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశంగా మరోసారి టాప్ లో ఉన్న దేశం ఇదే!

ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశంగా 5వ సారి టాప్ లో నిలిచిందీ దేశం..

World Happiest Country

World Most Happiest Country 2022: మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ టాప్ లో నిలిచింది. యూరప్ దేశం ఫిన్లాండ్ మరోసారి సంతోషంగా ఉండే విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ ఈ జాబితాలో నెంబర్ వన్ గా నిలవడం ఇది వరుసగా ఐదోసారి కావటం గమనించాల్సిన విషయం. సంతోషంగా ఉండటం అంటే సంపన్నంగా ఉండటంకాదు. సంతోషంగా ఉండటం అంటే సర్వసౌఖ్యాలు ఉండటంకాదు. సంతోషంగా ఉండటం అంటే మానసిక ప్రశాతంత కలిగి ఉండటం అని ఫిన్లాండ్ ను చూసి నేర్చుకోవాలి. వరుసగా ఐదవ సారి కూడా చిన్నదేశమైన ఫిన్లాండ్ నిలిచింది.

ఈ జాబితాలో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ 2వ స్థానంలో నిలువగా ఐస్ లాండ్ 3వ స్థానంలో నిలిచింది. అలాగే స్విట్జర్లాండ్ (4), నెదర్లాండ్స్(5), లగ్జెంబర్గ్ (6), స్వీడన్ (7), నార్వే (8), ఇజ్రాయెల్ (9), న్యూజిలాండ్ (10) టాప్-10లో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ ఆనందమయ దేశాల జాబితాలో 16వ స్థానంలో ఉంది. కెనడా ఓ మెట్టుపైన 15వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ కు 17వ స్థానం లభించింది.

136వ స్థానంలో భారత్..
ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గతం కంటే భారత్ మెరుగు సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ కంటే పొరుగుదేశాలు పాకిస్థాన్, శ్రీలంక ముందున్నాయి. పాకిస్థాన్ 121వ ర్యాంకు దక్కించుకోగా, శ్రీలంక 127వ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం.

చివరిస్థానంలో ఆఫ్ఘానిస్థాన్..
ఈ ఐక్యరాజ్యసమితి ప్రాయోజిత సూచికలో అత్యంత అశాంతి కలిగిన దేశంగా ఆఫ్ఘనిస్థాన్ (146) నిలిచింది. సంతోషదాయక దేశాల జాబితాలో ఆఫ్ఘన్ అన్నిటికంటే అట్టడుగున నిలిచింది. ఆఫ్ఘన్ కు పైన లెబనాన్, జింబాబ్వే దేశాలు నిలిచాయి.