Ruby Roman Grapes : వామ్మో.. ఈ ద్రాక్ష గుత్తి ధర రూ.7.5 లక్షలు.. ఎందుకంత రేటు

ఆ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర అక్షరాల రూ.7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఎందుకంత రేటు అంటే..

Ruby Roman Grapes

Ruby Roman Grapes : ద్రాక్ష పండు తినని వారు ఉండరు. ద్రాక్ష పండు ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కాగా, ఒక కిలో ద్రాక్ష ఎంత ధర ఉంటుంది? దాని రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.120 వరకు ఉండొచ్చు. కానీ, ఆ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రం 11 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ.7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. వేలంలో భారీ రేటుకు అమ్ముడుపోయింది. వామ్మో.. ఒక ద్రాక్ష గుత్తికి అంత ధరా? ఇంతకీ అందులో అంత ప్రత్యేకత ఏముంది? అనే సందేహం వచ్చింది కదూ. ఆ వివరాల్లోకి వెళితే…

రుబీ రోమన్ గ్రేప్స్‌గా(Ruby Roman grapes) పిలిచే ఈ ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారు. ఎంతో అందంగా, ఎర్రగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లను 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో వీటిని పండిస్తారు. సీజన్ లో మొదటి విక్రయానికి ముందు ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు. దీన్ని కొనుగోలు చేసేందుకు వందలాది మంది ఔత్సాహికులు పోటీపడతారు. 2019లో మొదటి ద్రాక్ష గుత్తిని కనజవాలో వేలానికి పెట్టారు.

జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. దీనికి రూ.11 వేల డాలర్లను చెల్లించింది. ఈ గుత్తిలో మొత్తం 24 ద్రాక్ష పండ్లు ఉన్నాయి. ఒక్కో పండు బరువు 20గ్రాములపైనే ఉంది. ఈ ద్రాక్ష పండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నిర్వాహకులు తెలిపారు.

ధరకు తగినట్లే ఈ ద్రాక్ష పండ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. చాలా తియ్యగా, అతి తక్కువ ఆమ్లత్వంతో, రసాలు నిండి ఉంటాయని తెలిపారు. సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందన్నారు. వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారన్నారు. కొన్ని హోటళ్లు వీటిని తమ వీఐపీ గెస్టుల కోసం కొనుగోలు చేస్తుంటాయన్నారు. సంపన్నులు దీన్ని లగ్జరీ ఫ్రూట్‌గా కొనుగోలు చేస్తారన్నారు. మొత్తంగా ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్షగా రూబీ రోమన్ గ్రేప్ రికార్డు నమోదు చేసింది. ఇలాంటి ద్రాక్షను కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.