కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు, చావులు మరే దేశంలోనూ నమోదు కాలేదు. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షలు అక్కడి వ్యాపార, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో షేవింగ్, కటింగ్, మసాజ్:
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలిఫోర్నియాలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. హెయిర్ సెలూన్ కేంద్రాలు మూసేశారు. తాజాగా ఆంక్షలను సడలించిన ప్రభుత్వం, సెలూన్ నిర్వాహాకులకు కాస్త ఊరట ఇచ్చింది. కటింగ్, షేవింగ్, మసాజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉంది. సెలూన్లు ఇండోర్ లో కాదు ఔట్ డోర్ లో చేసుకోవాలి. అంటే, బహిరంగ ప్రదేశాల్లోనే కటింగ్, షేవింగ్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఆరుబయట కూడా భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేయడం తదితర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం దుకాణదారులను ఆదేశించింది. దీంతో దుకాణాల ముందే టెంట్లు వేసి హెయిర్ కటింగ్ పనులు చేస్తున్నారు. కనీసం ఆరు బయటనైనా పనులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని హెయిర్ సెలూన్ నిర్వాహకులు అంటున్నారు. అంతో ఇంతో ఆదాయం వస్తుందని, తమ కుటుంబాలకు తిండి పెట్టగలమని ఆనందిస్తున్నారు.
39లక్షల కరోనా కేసులు, లక్షా 47వేల మరణాలు:
కరోనా వైరస్ దెబ్బకు అమెరికా విలవిలలాడిపోతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 39లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షా 47వేల మంది కొవిడ్ తో చనిపోయారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిపోయే ముందు, అది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని ట్రంప్ మీడియాతో అన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రం వైరస్ కట్టడికి చాలా బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. మిగతా ప్రాంతాల్లో కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ పరిస్థితులు మరింత దిగజారుతున్నట్లు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారినట్లు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్న ట్రంప్:
అత్యంత తీవ్రత కలిగిన ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించాలని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించ లేని సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. ‘‘మీకు నచ్చినా, నచ్చకపోయినా వైరస్ నియంత్రణలో మాస్కులు ప్రభావం చూపిస్తాయి’’ అని ట్రంప్ అన్నారు.