Gender Reveal Party
Gender Reveal Party: కడుపులో బిడ్డ ఆడా.. మగా తెలుసుకోవడం.. పుట్టేది ఆడబిడ్డని తేలితే పురిట్లోనే చిదిమేయడం అనేది మన సమాజంలో చాలాకాలంగా వేళ్లూనుకుపోయిన ఓ జాడ్యం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి నీచమైన ఒక దురాగతం. అందుకే పుట్టేది ఏ బిడ్డ అనేది ఏ డాక్టర్ టెస్ట్ చేయకూడదు.. చెప్పకూడదు.. తల్లిదండ్రులు సైతం ఈ తరహా పరీక్షలు చేయాలని ఏ ఆసుపత్రిని అడగకూడదు. అది చట్టరీత్యా నేరం. మరోవైపు సమాజంలో కూడా ఆడ, మగ అనే లింగభేదంపై ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి.
అదే సమయంలో ఇంత కఠిన నిబంధనలు ఉన్నా.. పుట్టేది ఎవరైనా ఒక్కటే అనే భావన వ్యాపిస్తున్నా.. పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ కల్చర్ కూడా ఎక్కువవుతుంది. గత సంవత్సరం యూఏఈకి చెందిన ఓ జంట ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా వద్ద జెండర్ రివీల్ పార్టీ చేసుకుని ఇబ్బందుల పాలవగా.. ఇప్పుడు సియామండ్ ముస్తఫా అనే ఓ యూట్యూబర్ తనకు అబ్బాయి పుట్టబోతున్నాడని గీజా పిరమిడ్ వద్ద భారీ పార్టీ ఇచ్చాడు. అంతేకాదు.. అక్కడ పార్టీ సెలబ్రేషన్ కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు.
గీజా పిరమిడ్ వద్ద లైటింగ్ డెకరేషన్ చేయించి, పిరమిడ్స్ బ్లూ కలర్‌లోకి మారగానే సియామండ్ ముస్తఫా, భార్య షాహద్ తమకు కొడుకు పుట్టబోతున్నాడని ప్రకటించి పార్టీ మొదలు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా చివరకు పిరమిడ్ అధికారుల వరకు వెళ్లింది. వరల్డ్ లివర్ డే పేరుతో పిరమిడ్ డెకరేట్ చేయించి ఇలా జెండర్ రివీల్ పార్టీ చేసుకున్నారని నిర్ధారణ చేసుకొని కేసు ఫైల్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వీడియో వైరల్ కావడంతో యూట్యూబర్ సియామండ్ ముస్తఫా మీద నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.