×
Ad

Hindu Man Lynch: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య.. యూనస్ ప్రభుత్వం కీలక ప్రకటన..

గత ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన, షేక్ హసీనా- భారతదేశ వ్యతిరేకిగా గుర్తింపు పొందిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత ఢాకాలో చెలరేగిన హింస మధ్య ఈ మూకదాడి జరిగింది.

Hindu Man Lynch: విద్యార్థి నాయకుడి మరణంతో బంగ్లాదేశ్ లో హింస చెలరేగింది. ఇదే సమయంలో మత దూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడం కలకలం రేపింది. దీనిపై బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ‘కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావు లేదని’ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందూ యువకుడిని కొట్టి చంపిన నేరంలో పాలుపంచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది.

మృతుడు దీపు చంద్ర దాస్.. భలుకా ఉప జిల్లాలోని దుబాలియా పారా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వస్త్ర కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ప్రవక్త గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేసి చంపేశారు.

”మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నూతన బంగ్లాదేశ్‌లో ఈ రకమైన హింసకు చోటు లేదు. ఈ క్రూరమైన నేరంలో పాలుపంచుకున్న ఎవరినీ వదిలిపెట్టేది లేదు” అని ఢాకా ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని ఉగ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న హింసాత్మక ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాత్కాలిక ప్రభుత్వం పౌరులను కోరింది. హింస, భయం, దహనం, విధ్వంసం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ ఒక కీలకమైన దశలో చారిత్రాత్మక ప్రజాస్వామ్య పరివర్తన మార్గంలో వెళుతోంది. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలను దేశం శాంతి వైపు వెళ్ళే మార్గాన్ని అడ్డుకోవడానికి అనుమతించబోము అని హెచ్చరించింది.

”దేశ సాంస్కృతిక సలహాదారు ముస్తఫా సర్వర్ ఫరూకీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఛాయానౌట్ భవన్‌లో జరిగిన దాడి, దోపిడీకి బాధ్యులైన వారిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తిస్తున్నాం. వారిని చట్టం ముందు నిలబెడతాం” అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు.

”ధన్మొండిలోని దెబ్బతిన్న ప్రాంగణాన్ని ఫరూకీ సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేలా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో త్వరితగతిన మరమ్మతులు చేస్తాం. అలాగే పోలీసులు, BGB సమక్షంలో కఠినమైన భద్రతను మోహరించాము” అని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించే కుట్రగా ఈ ఘటనను అభివర్ణించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కరినీ చట్టం కిందకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

గత ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన, షేక్ హసీనా- భారతదేశ వ్యతిరేకిగా గుర్తింపు పొందిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత ఢాకాలో చెలరేగిన హింస మధ్య ఈ మూకదాడి జరిగింది. ఇటీవలి అశాంతి సమయంలో కార్యాలయాలు, సిబ్బందిపై దాడులకు గురైన ది డైలీ స్టార్, ప్రొథమ్ ఆలో, న్యూ ఏజ్ పత్రికల జర్నలిస్టులకు యూనస్ ప్రభుత్వం సంఘీభావం తెలియజేసింది.

Also Read: అమెరికా గ్రీన్ కార్డు లాటరీని నిలిపేసిన ట్రంప్.. ఏంటి ఇది? భారతీయులపై ప్రభావం ఉంటుందా?