అమెరికా గ్రీన్ కార్డు లాటరీని నిలిపేసిన ట్రంప్.. ఏంటి ఇది? భారతీయులపై ప్రభావం ఉంటుందా?

సాధారణంగా గ్రీన్ కార్డు లాటరీగా డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసాను పిలుస్తారు.

అమెరికా గ్రీన్ కార్డు లాటరీని నిలిపేసిన ట్రంప్.. ఏంటి ఇది? భారతీయులపై ప్రభావం ఉంటుందా?

Donald Trump

Updated On : December 19, 2025 / 6:24 PM IST

Green Card Lottery: డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం, మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కాల్పుల ఘటనల తరువాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం ఈ ప్రోగ్రామ్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది.

సాధారణంగా గ్రీన్ కార్డు లాటరీగా డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసాను పిలుస్తారు. అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. దాన్ని మరింత కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ట్రంప్‌ ఇప్పుడు మరో అడుగు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వీసాల పరిశీలనతో పాటు హెచ్ 1బీ, హెచ్ 4, ఎఫ్, ఎం, జే వీసాల జారీపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ నిలిపివేతతో ట్రంప్‌ చర్యల్లో మరో కొత్త దశ ప్రారంభమైనట్టు స్పష్టం అవుతోంది.

డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ అంటే అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల పౌరులకు లాటరీ విధానంలో శాశ్వత నివాస అనుమతి అవకాశం ఇచ్చే వీసా పథకం.

డీవీ1 లాటరీని ఎందుకు నిలిపివేశారు?
బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటన ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. కాల్పుల ఘటనలో పోర్చుగీస్ పౌరుడు క్లాడియో మాన్యువెల్ నేవెస్ వాలెంటే(48)ను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగ కార్యదర్శి క్రిస్టీ నోయం ఎక్స్‌లో ఓ ప్రకటన చేశారు. నిందితుడు వాలెంటే 2017లో డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్-డీవీ1 ద్వారా అమెరికాలో ప్రవేశించి గ్రీన్ కార్డు పొందాడని తెలిపారు.

డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపేసేందుకు 2017లోనే ట్రంప్ ప్రయత్నించారని తెలిపారు. ఇకపై మరింత మంది అమెరికన్లు ఇటువంటి ప్రోగ్రామ్ వల్ల నష్టపోకుండా ఉండేందుకు, ఇప్పుడు ట్రంప్ ఆదేశాల మేరకు డీవీ1 ప్రోగ్రామ్‌పై సస్పెండ్‌ విధించాలని యూఎస్‌సీఐఎస్‌కు ఆదేశిస్తున్నానని చెప్పారు. కాగా, ఆ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 9 మంది గాయపడ్డారు.

భారతీయులపై ప్రభావం చూపుతుందా?
డీవీ1 లాటరీ నిలిపివేత ప్రభావం భారతీయులపై పడదు. అసలు ఈ డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ మనకు వర్తించదు. అమెరికాకు అధిక వలసల కారణంగా 2028 వరకు భారతీయులు డైవర్సిటీ వీసాకు ఇప్పటికే అనర్హులుగా ఉన్నారు.

ఈ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం.. ఏ దేశం నుంచైతే గత 5 సంవత్సరాల్లో 50,000 కంటే ఎక్కువ మంది అమెరికాకు వలస వస్తారో ఆ దేశం ఈ వీసాల దరఖాస్తులకు అనర్హ పొందదు. ఈ పరిమితిని భారత్ దాటిపోయింది.

  • 2021లో అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు 93,450 మంది
  • 2022లో 27 లక్షలు మంది
  • 2023లో 78,070 మంది

ఈ గణాంకాల కారణంగా భారత్, చైనా, మెక్సికో, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్, వియత్నాం వంటి దేశాలను డీవీ-2026 లాంటి లాటరీల నుంచి పక్కకు తప్పించారు. ఈ లాటరీని 2028 వరకు భారతీయులు పొందలేరు.