Zohran Mamdani
Zohran Mamdani : అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ గెలిచి చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆడ్రూ కుయోమోకు మద్దతుగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. తనదైన వ్యూహాలతో జ్రోహాన్ మమ్దానీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ.. మమ్దానీ సరికొత్త రాజకీయానికి ట్రంప్ ఎత్తులు చిత్తయ్యాయి. భారీ మెజార్టీతో మేయర్ ఎన్నికల్లో మమ్దానీ ఘన విజయం సాధించారు. ఈ పదవి దక్కించుకున్న తొలి భారత -అమెరికన్ ముస్లిం ఈయనే కావడం గమనార్హం. మమ్దానీ భారతీయ మూలాలున్న వ్యక్తి. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు మమ్దానీ.
న్యూయార్క్ మేయర్ ఎన్నికల పోరు ఒకానొక దశలో ట్రంప్ వర్సెస్ మమ్దానీ అన్నట్లుగా తలపించాయి. ట్రంప్ పదేపదే మమ్దానీని “కమ్యూనిస్ట్ పిచ్చివాడు” “జరగడానికి వేచి ఉన్న విపత్తు” అని అభివర్ణించారు. మమ్దానీ విజయాన్ని నిరోధించడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కుయోమోకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ ఓటర్లను కోరారు. ‘మీరు ఆండ్రూ కుయోమో మద్దతుగా నిలవాలి.. అతనికి ఓటు వేయాలి. అతను అద్భుతమైన పని చేస్తాడని ఆశిస్తున్నాను. మమ్దానీ గెలిస్తే న్యూయార్క్‌కు సమాఖ్య నిధులు ప్రమాదంలో పడవచ్చని ట్రంప్ హెచ్చరించారు. మమ్దానీ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్‌కు సమాఖ్య నిధులను తగ్గిస్తానని ట్రంప్ అన్నారు.
Also Read: US Mayor Elections: ట్రంప్ పార్టీకి షాక్.. జేడీ వాన్స్ తమ్ముడ్ని ఓడించిన ఇండియన్ అమెరికన్
మమ్దానీ సైతం ట్రంప్‌కు గట్టి కౌంటర్లు ఇస్తూ ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. మమ్దానీ ఎన్నికలకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “న్యూయార్క్ ప్రజల కోసం అధ్యక్షుడి (ట్రంప్) తో కలిసి పనిచేస్తాను” కానీ “భయపడను” అని అన్నారు. మీరు న్యూయార్క్ వాసుల జీవితాన్ని మరింత కష్టతరం చేయాలనుకుంటే.. మీతో పోరాడటానికి నేను అక్కడ ఉంటాను అంటూ మమ్దానీ డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..
మరోవైపు.. న్యూయార్క్ నగర ప్రజలను ఆకట్టుకునేలా మమ్దానీ పలు హామీలు గుప్పించారు. ముఖ్యంగా మధ్య తరగతి, పేద వర్గాల వారికి మేలు చేసేలా తన హామీలు ఉన్నాయి. అందులో సార్వత్రిక పిల్లల సంరక్షణ హామీ. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. నగరంలో పిల్లల సంరక్షణ ఖర్చులు సంక్షోభ స్థాయికి చేరుకున్నాయి. 6 వారాల నుంచి ఐదు సంవత్సరాలు మధ్య వస్సు ఉన్న అన్నివర్గాల నగర పిల్లలకు ఉచిత పిల్లల సంరక్షణ అందించాలని జోహ్రాన్ మమ్దానీ ప్రతిపాదించారు. అధిక ఆదాయం సంపాదించేవారిపై, పెద్ద సంస్థలపై పన్నులను పెంచడం ద్వారా ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చాలని యోచిస్తున్నారు.
జోహ్రాన్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. న్యూయార్క్ నగరంలో బస్సు ప్రయాణం ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. న్యూయార్క్ నగర బస్సులన్నటింపై చార్జీలను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించారు. అంతేకాక నగరం అంతటా బస్సులు తిరిగేలా బస్సుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. మరోవైపు తక్కువ ధరలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించేలా ఐదు బారోగ్‌లలో ప్రతిదానిలో ప్రభుత్వం నిర్వహించే ఒక దుకాణాన్ని ఏర్పాటు చేస్తామని మమ్దానీ చెప్పారు.
ఇక ఎలాంటి పార్టీ ప్రముఖుల మద్దతు లేకుండానే నేరుగా ప్రజలకు జోహ్రాన్ మమ్దానీ దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలతో దగ్గర సంబంధం పెట్టుకున్నారు. ఇక ఆయా టోర్నమెంట్లు జరిగే కార్యక్రమాల్లో ప్రకటనల ద్వారా దగ్గరయ్యారు. అంతేకాకుండా.. మమ్దానీ రాజకీయ ప్రసంగాలు రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేకంగా ఉండటం ప్రజలను ఆకట్టుకుంది. ధనవంతులపై పన్ను విధించడం, పిల్లల సంరక్షణ, గృహ నిర్మాణాన్ని హక్కుగా మార్చడం వంటి ప్రసంగాలు చేశారు. ఇవే మమ్దానీపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచింది.