10 Years Old Girl Died While Playing With Cradle In Home
Girl Game with Cradle: ఏది ప్రమాదమో తెలుసుకోలేని పసితనం పిల్లలది. తమకు నచ్చిన వస్తువును ఆట వస్తువుగా భావించి అందులో ఆనందాన్ని వెతుక్కోవడమే వారికి తెలిసిన ముచ్చట. కానీ వారు వాడే వస్తువులతో ఒక్కోసారి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ వస్తువుతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించాల్సిన బాద్యత పెద్దలదే. ఏ మాత్రం ఏమరపాటు వహించినా దాని పర్యవసానం జీవితాంతం దుఃఖాన్ని మిగులుస్తుంది. హైదరాబాద్ నగర పరిధిలోని నాచారంలో ఇలాంటి ఒక విషాద ఘటనే ఒకటి జరిగింది. పదేళ్ల బాలిక చీరతో కట్టిన ఊయలతో ఆటలాడుతుండగా ఆ చీర మెడకి బిగుసుకొని ఉసురుతీసింది.
నాచారంలోని మజీద్‌బాబానగర్‌లో ఒల్లూరి రమేష్ తన భార్య, పదేళ్ల కుమార్తె మనస్విని, ఎనిమిదేళ్ల కుమారుడు, తన తల్లి ఉమారాణితో కలిసి నివసిస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగులు కాగా రమేష్ తల్లే ఇంట్లో ఉండి కుమార్తె, కుమారుడి బాగోగులు చూసుకుంటుంది. రమేష్ కొడుకు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్య చికిత్సను అందిస్తూనే కూతురు మనస్విని హబ్సీగూడలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూలులో నాలుగో తరగతి చదివిస్తున్నారు. ఎప్పటిలానే గురువారం కూడా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లగా ఉమారాణి ఇంట్లో పిల్లలను చూస్తుంది. ఈక్రమంలో బాబు నిద్రపోతుండగా మనస్విని చీరతో కట్టిన ఊయలలో ఊగుతుంది. దీంతో ఉమారాణి కూడా నిద్రలోకి జారుకుంది.
సాధారణంగా మనస్విని రోజూ ఊయలలో కూర్చొని దానిని మెలేసినట్లుగా తిప్పి ఒక్కసారిగా వదిలితే గుండ్రంగా తిరగడం అలవాటుగా చేసుకుంది. గురువారం కూడా అదే విధంగా ఊయలలో కూర్చొని తిప్పసాగింది. ఎక్కువగా మెలేయడంతో ఆ చీర మనస్విని మెడకి బిగుసుకుపోయింది. విడిపించుకోవడం చేతకాకపోవడం.. కేక వేయడానికి సహకరించకపోవడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. నిద్రలేచిన ఉమారాణి చూసేసరికి పాప ఊయలలో నిర్జీవంగా పడిఉండడంతో కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి చూసి పాపను విడిపించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని మనస్విని కోసం విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.