13 Years Boy Cycled 250 km : తనకిష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలవటానికి 13 ఏళ్ల బాలుడు సైకిల్‌పై 250కి.మీటర్ల ప్రయాణం .. కానీ పాపం..
తనకిష్టమైన యూట్యూబ్ స్టార్‌ను కలవటానికి 13 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ 250కి.మీటర్ల ప్రయాణించాడు. .. కానీ పాపం..

13 Years Boy Cycled 250 km (1)
13 Years Boy Cycled 250 km : తమకు ఇష్టమైన నటులను కలవటానికి అభిమానులు వందల కిలోమీటర్లు ప్రయాణించి వారిని కలిసాక ఎంతో సంతోషం వ్యక్తంచేసిన ఘటనల గురించి విన్నాం. కానీ ఓ పిల్లాడు తనకు ఎంతో ఇష్టమైన యూట్యూబ్ స్టార్ ను కలవటానికి వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణించాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేసి తన కిష్టమైన యూట్యూబ్ స్టార్ ను కలవటానికి సైకిల్ పై బయలుదేరాడు. అలా మూడు రోజులపాటు 250 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించాడు. మరి అతని ఆకాంక్ష నెరవేరిందా? తన స్టార్ ను కలుసుకున్నాడా? అంటే లేదు. దీంతో వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన పిల్లాడికి తీవ్ర నిరాశ ఎదురైంది. పడిన కష్టమే కాదు..తన ఆశ నెరవేరనందుకు ఆ పిల్లాడు నిరాశ చెందాడు.
పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 13 ఏండ్ల బాలుడు.. 8వ తరగతి చదువుతున్నాడు. యూట్యూబ్‌లో ట్రిగ్గర్డ్ ఇన్‌సాన్ అనే చానెల్‌ను ఫాలో అవుతుంటాడు. ఈ చానెల్‌లో వచ్చే కామెడీ ఎంతో ఇష్టపడతాడు. దీంతో ఆ చానెల్ నిర్వాహకుడు నిష్‌చాయ్ మల్హాన్‌ను కలవాలనుకున్నాడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇంకేముంది తనకిష్టమైన స్టార్ ను కలవటానికి అక్టోబర్ 4న ఇంట్లో చెప్పకుండా పాటియాలనుంచి తన సైకిల్‌పై ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించాడు. మూడు రోజుల పాటు 250 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి..పితంపుర అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నాడు. ఇంకెంత కొన్ని నిమిషాల్లో తన స్టార్ ను కలుసుకోవచ్చని ఎంతో సంతోషపడిపోయాడు.
కానీ అతని ఆతృత..ఆకాంక్ష నెరవేరలేదు. ఎందుకంటే ఆ సమయంలో మల్హాన్ ఇంట్లో లేడు. దుబాయ్ వెళ్లాడరి కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ పిల్లాడు డీలా పడిపోయాడు. ఇంత ఆశగా వచ్చాను కనీసం చూడలేకపోయానే అని తెగ నిరాశ చెందారు. మరోపక్క కొడుకు కనిపించకపోవటంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు నానా హైరానా పడ్డారు. ఫ్రెండ్స్ ఇళ్లల్లో వాకబు చేశారు. అంతటా వెదికారు కానీ కనిపించలేదు. దీంతో వారి ఆందోళన అంతా ఇంతా కాదు. దీంతో ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.పాటియాలాలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఢిల్లీ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. అలా సీసీటీవీ ఫుటేజీ ద్వారా బాలుడి ఆచూకీని కనుగొన్నారు. పితంపురలో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా..ట్రిగ్గర్డ్ ఇన్‌సాన్ యూట్యూబ్ ఛానెల్‌కు 1.69 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.