ఊరికెళ్తుంటే ఊహించని ప్రమాదం….14మంది వలసకూలీలు మృతి

కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు…. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించడంతో ఇప్పుడు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. వలసకార్మికులను తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్ల పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన సొంతూర్ల బాట పట్టిన వలసకూలీలు వరుసగా రోడ్డు ప్రమాదాల బారీన పడుతున్నారు. అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ల్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున 3-4గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసకార్మికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం బారీన పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్  తరలించారు. వలసకూలీల్లో చాలామంది యూపీలోని ఉన్నావోకి చెందినవారని తెలుస్తోంది.

ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే మరోవైపు దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో వలసకూలీలను హాస్పిటల్ కు తరలించే క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు ఆ తర్వాత క్వారంటైన్ అయినట్లు సమాచారం.

కాగా,మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌-సహరాన్పూర్‌ రహదారిపై  గురువారం తెల్లవారుజామున జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 6గురు వలస కూలీలు మృతి చెందారు. రోడ్డు వెంబడి స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపైకి వేగంగా వచ్చిన బస్సు దూసుకెళ్లింది.  పంజాబ్‌ నుంచి తమ స్వస్థలమైన బీహార్‌కు కాలినడకన నడుచుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read Here>> అప్పుడు తల్లిని.. ఇప్పుడు కొడుకుని.. మద్యం మానేయమన్నందుకు చంపేశాడు

ట్రెండింగ్ వార్తలు