Anand Sharma raises questions: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న పోలింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేసిన సీనియర్ నేత ఆనంద్ శర్మ

సీడబ్ల్యూసీ సమావేశంలో నిన్న ఆనంద్ శర్మ మాట్లాడుతూ... అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితా అందలేదని ఆరోపించారు. ఆ ఎన్నిక పక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే జరుగుతుందా? లేదా? అని ఆయన నిలదీసినట్లు తెలిసింది. అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితాను విడుదల చేయకపోతే పారదర్శకత ఎక్కడ ఉంటుందని, పార్టీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు.

Anand Sharma raises questions: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబరు 17న పోలింగ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ఎన్నిక పక్రియపై ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో నిన్న ఆన్‌లైన్‌లో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ షెడ్యూలును ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారత్ వ్యాప్తంగా పీసీసీ ప్రధాన కార్యాలయాల్లో పోలింగ్‌ జరుగుతుందని కాంగ్రెస్ చెప్పింది.

ఇందులో దాదాపు 9 వేల మంది ప్రతినిధులు ఓటు వేస్తారని పేర్కొంది. అయితే, సీడబ్ల్యూసీ సమావేశంలో నిన్న ఆనంద్ శర్మ మాట్లాడుతూ… అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితా అందలేదని ఆరోపించారు. ఆ ఎన్నిక పక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే జరుగుతుందా? లేదా? అని ఆయన నిలదీసినట్లు తెలిసింది. అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితాను విడుదల చేయకపోతే పారదర్శకత ఎక్కడ ఉంటుందని, పార్టీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు.

ఎన్నికకు ఓటర్ల తుది జాబితాను రూపొందించే ముందు ఏదైనా సమావేశం నిర్వహించారా? లేదా? అని కూడా ఆనంద్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఎన్నిక పక్రియపై ఎవ్వరూ ఎటువంటి ప్రశ్న వేయలేదంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విటర్ లో పేర్కొన్నారు. ఈ ఎన్నికలో ఎవరైనా సరే పోటీ చేయవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.

కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ విముఖంగా ఉండడంతో ప్రియాంకా గాంధీ లేదా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ను ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్‌ వచ్చే నెల 22న విడుదల కానుంది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీకి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి ఫలితాలు అదే నెల 19న ప్రకటిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్‌ నేతల్లో పలువురు విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడుతోంది.

India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు

ట్రెండింగ్ వార్తలు