‘నేనూ మహిళనే’ : అవమానాలకు ‘మిస్‌ ట్రాన్స్‌ ఇండియా’ ఆర్చీ సింగ్‌ ధీటైన సమాధానం

Trans Model Archie Singh  Miss International Trans 2021 : సమాజం నుంచి ఎదురయ్యే వేధింపులను..వివక్షలను ఎదుర్కొని ట్రాన్స్ జెండర్లు ఎదుగుతున్నారు. డాక్టర్లుగా…లాయర్లుగా..పోలీసులుగా..మోడిలింగ్ ల్లో కూడా రాణిస్తున్నారు. కానీ సమాజం నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్ని ఎదుగుతున్న ట్రాన్స్ జెండర్లు ఏ స్థాయిలకు వెళ్లినా వారిపై ఉండే దృష్టి పోవటం లేదనే చెప్పాలి.

అలా ఎన్నో అవమానాలకు ఎదుర్కొని తనకు ఇష్టమైన మోడలింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆర్చీ సింగ్. ఎన్నో అవమానాలను ఎదుర్కొని తట్టుకుని నిలిచింది. మోడలింగ్ లో ప్రవేశించిన రోజుల్లో ఆర్చీ సింగ్ కు ఎదురైన మొదటి మాట ‘‘నువ్వు నిజమైన, పరిపూర్ణ మహిళవు కాదు కదా’’ అని. ఇటువంటి ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురైనా ఎక్కడా భయపడలేదు. ఇవినాకు కొత్తకాదులే అన్నట్లుగా ముందుకే అడుగులు వేసింది.

పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్‌ ఐడెంటిని బయటపెట్టిన ఆర్చీ.. ఆపరేషన్‌ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి…అంచెలంచెలుగా ఎదుగుతూ..‘మిస్‌ ట్రాన్స్‌ ఇండియా’ కిరీటం దక్కించుకుంది 22 ఏళ్ల ఆర్చీ. ఈ క్రమంలో ఆమెకు ఎన్నోసార్లు వినిపించిన మాట.. ‘‘నువ్వు నిజంగా అమ్మాయివి కాదు’’కదా అని.

‘‘ నేనూ మహిళనే’’..
దీనికి ఆర్చీ ధీటైన సమాధానాన్నే ఇచ్చింది. ‘‘ నేనూ మహిళనే.. ట్రాన్స్‌జెండర్‌ అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే గుణాలన్నీ నాలో ఉన్నాయి. నేను అమ్మాయినే అని రుజువు చేసేందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐడీ నా వద్ద ఉంది చూడాలనుకునేవాళ్లకు చూపిస్తాను..గవర్నమెంట్ ఇచ్చిన ఐడీకంటే ఇంకేకావాలి మీకు? నేను సర్జరీ చేయించుకుని పూర్తిగా స్త్రీగా మారిపోయాను అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెబుతోంది.

కానీ..ఇది కాకుల్లా పొడిచే సమాజం కదా.. ఎన్నిసార్లు చెప్పినా..ఎలా చెప్పినా సరే వేలుపెట్టి చూపిస్తూనే ఉంది. అనుమానంగా..అవహేళన చేస్తునే ఉంది. ఆమె ఎదుగుదలను సహించలేని కొంతమంది ఆమెను కావాలనే సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి వేధించేవారు. అయినా ఆర్చీ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అవమానాలు ఎదురయ్యేకొద్దీ..రెట్టించిన ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ..కొలంబియాలో జరిగే మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. అందాల పోటీలకు సన్నద్ధమవుతోంది.

అర్థం చేసుకున్న కుటుంబం..అండగా ఉన్నామంటూ ధైర్యం..
ఆర్చీ సింగ్ ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. స్కూల్ లో చదువుకునేటప్పుడే అమ్మాయిలా ఉండాలనిపించే తన మానసిక స్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు ఆందోళన పడిపోయారు. తమ బిడ్డ అందరిలా కాకుండా వేరేగా ఉండటంతో భయపడిపోయారు. అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మానసికంగా సిద్ధపడిపోయారు. అలా అర్థం చేసుకుని ఆర్చీకి అండగా నిలబడ్డారు.

అవమానాలకు ఎదిరించి మోడలింగ్ లో రాణించి..
మోడలింగ్‌ చేయాలనేది ఆర్చీసింగ్ కు చిన్ననాటి కల. తనలో వచ్చిన మార్పుల వల్ల తన కలను చెదరనివ్వలేదు. పెద్దయ్యాక మోడలింగ్ కెరీర్‌ ఆరంభించకముందు సోషల్‌ వర్క్‌లో భాగమైంది. ట్రాన్స్‌జెండర్ల గురించి సమాజంలో ఉండే ఎన్నో అపోహలు, అనుమానాలు, చిన్నచూపు తొలగిపోయేలా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మోడలింగ్‌ లోకి వచ్చాక అది మరింతగా విస్త్రృతపరిచింది. మోడలింగ్ అనేది ట్రాన్స్ జెండర్ల విషయంలో కలిగించాల్సిన అవగాహనకు ఓ చక్కని వేదిక చేసుకుంది ఆర్చీ.అననుకూల పరిస్థితుల్లో అనుకూలంగా మార్చుకోవటంతో ఆర్చీ సింగ్‌ ది అందె వేసిన చేయి.

అవమానాల్ని, ఛీత్కారాలు ఎదుర్కొని..అంతర్జాతీయ వేదికపై నడిచే అవకాశాన్ని దక్కించుకున్న ఆర్చీ సింగ్
సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల ఉండే వివక్ష గురించి ఆర్చీ సింగ్ మాట్లాడుతూ.. ప్రతిభ, అందం లేదని నేనెప్పుడు అనుకోలేదు. ఎవరి అందం వారిది. ఎవరి ప్రతిభ వారిది. కేవలం నేను ట్రాన్స్‌ ఉమన్‌ అయినందువల్లే ఎన్నో అవమానాల్ని, ఛీత్కారాలు ఎదుర్కొన్నాను. కానీ ఇవన్నీ నేను ఊహించినవే. కాబట్టి మానసికంగా నేను అన్నింటికి సిద్దంగా ఉన్నారు. అవమానాలు ఎదురయ్యేకొద్దీ నాలో పట్టుదల పెరిగింది. అవమానాల్ని, ఛీత్కారాలను అధిగమించి నేను అంతర్జాతీయ వేదికపై నడిచే అవకాశాన్ని దక్కించుకున్నాను. మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నానని తెలిపింది.

ఓ మనిషికి కావాల్సింది  జెండర్ కాదు..మానవత్వం
మనం ఓ మనిషిగా పుట్టింది మానవత్వం చాటుకోవటానికి. దానికి జెండర్ తో సంబంధంలేదు. జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి మనిషి తనలోని మానవత్వాన్ని చాటుకోవాలని..ఈ భూమ్మీద పుట్టిన తోటి ప్రాణులను ఆదుకునే గుణాన్ని అలవరచుకోవాలని సూచించింది ఆర్చీ. సెక్సువాలిటీ లేదా చేసే పని ఆధారంగా ఫలానా అనే గుర్తింపు కంటే ముందు మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని చాలా మంచి మంచి సూచనలిస్తోంది ఆర్చీ.

మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021 టైటిల్‌ విజేతగా నిలవడమే నా లక్ష్యం : ఆర్చీ సింగ్
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ట్రాన్స్‌జెండర్ల పట్ల చిన్నచూపు..చులకన భావం చాలా ఎక్కువగా ఉంటుందని…ఎవ్వరూ కావాలని అలా పుట్టరు..ప్రకృతిసిద్ధంగా జరిగే మార్పులకు ట్రాన్స్ జెండర్లను నిందించవద్దని కోరింది. మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021 టైటిల్‌ విజేతగా నిలవడమే ప్రస్తుతం తనకు లక్ష్యం అంటోంది ఆర్చీ సింగ్‌. మరి ఆర్చీ సింగ్ కు అందరం ఆల్ ద బెస్ట్ చెబుదాం..మన పుట్టుకలు మన చేతుల్లో లేవు.. కాబట్టి థర్డ్ జెండర్లను అవమానించవద్దని..వాళ్లు కూడా సమాజంలో భాగమేనని చెబుదాం..