Meenakshi
CBI Probe: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భయపడ్డారని, అందుకే కొత్త మద్యం పాలసీని వెనక్కు తీసుకున్నారని బీజేపీ చురకలంటించింది. ఢిల్లీలో వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కొత్త మద్యం పాలసీ విధానంలో అవకతవకలను ఎత్తిచూపుతూ ఇటీవల విడుదలైన ఓ నివేదికపై వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు కూడా ఉంది.
దీంతో పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ”సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడింది. అవినీతి బయటపడిపోతుందని భావించింది. అందుకే కొత్త మద్యం విధానాన్ని వెనక్కు తీసుకుంది. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ కొత్త మద్యం విధానం ద్వారా పొందే లైసెన్సుల కమీషన్‌ను 2.5 శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెంచారు?” అని నిలదీశారు.
బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా కూడా ఈ విషయంపై స్పందించారు. కొత్త మద్యం పాలసీని వెనక్కి తీసుకుంటూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఢిల్లీ వాసులతో పాటు తమ కార్యకర్తల విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పాలసీని వెనక్కు తీసుకోవాలని తాము పోరాడామని చెప్పారు. కాగా, కొత్త ఎక్సైజ్ పాలసీద్వారా కొందరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను మనీశ్ సిసోడియానే తీసుకున్నారని ప్రచారం జరిగింది. కొత్త ఎక్సైజ్ పాలసీని గత ఏడాది నవంబరు 17 నుంచి ఢిల్లీలో అమలు చేస్తున్నారు.
Kerala: యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు.. తాగి ఆసుపత్రిలో చేరిన అతడి స్నేహితుడు