Corona Vaccine
Corona Vaccine: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్ని కాపాడే ఆయుధం టీకా. అందుకే వీలైనంత విస్తృతంగా వ్యాక్సిన్ అందించాలని మేధావుల సూచనలతో ప్రభుత్వం ముమ్మర చర్యలు మొదలు పెట్టింది. దీంతో టీకా కార్యక్రమం జోరందుకుంది.
అయితే.. ఇదే సమయంలో కొందరి ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అలసత్వం.. అపోహలు ఉండిపోయాయి. ఇందుకోసం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో ఆఫర్లను ప్రకటించి మరీ ప్రజలను వ్యాక్సిన్ తీసుకొనేలా చేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ సంస్థల నుండి పలుస్వచ్ఛంద సంస్థల వరకు ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల లాటరీ తీసి భారీ మొత్తంలో డబ్బు, బంగారం ఇస్తామంటే మరికొన్ని చోట్ల బీరు, బిర్యానీ.. చివరికి గంజాయి కూడా ఇస్తామన్నారంటే అతిశయోక్తి కాదు.
వ్యాక్సిన్ తీసుకుంటే వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్‌స్లీ లాటరీ టికెట్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించగా.. ఈ లాటరీ టికెట్ కింద 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు, కాలేజి ట్యూషన్ అసిస్టెంట్, విమాన టికెట్లు, గేమ్ సిస్టమ్‌ను లాటరీ కింద ఇస్తామని వెల్లడించారు. పశ్చిమ వర్జీనియాలో టీకా తీసుకున్నవారికి 1.588 మిలియన్ యూఎస్ డాలర్ల బహుమతి నుంచి షాట్‌గన్స్, రైఫిల్స్ వరకు ఉచితంగా ఇస్తున్నారు. సెర్బియాలో ప్రజలను ఉచితంగా వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకెళ్లడమే కాకుండా.. షాపింగ్ చేసుందుకు డిస్కౌంట్ వోచర్లను కూడా అందిస్తుంది.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి బాగ్దాద్‌లోని ఒక కాఫీ షాప్ ఉచితంగా కాఫీ అందించనుండగా కాలిఫోర్నియాలో అయితే ఏకంగా 116.5 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, గిఫ్ట్ కార్డులను ప్రకటించారు. ఇక వాషింగ్టన్‌లో అయితే లైసెన్స్‌డ్ గంజాయి ఔట్‌లెట్ల నుంచి ఒక్కసారి గంజాయిని పొందవచ్చని వాషింగ్టన్ స్టేట్ లిక్కర్ అండ్ కన్నబీస్ బోర్డు ప్రకటించింది. ఇజ్రాయెల్ లో అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా బీర్ లేదా డ్రింక్ ఇస్తున్నారు. ఇక మన దేశంలో అయితే కొన్నిచోట్ల మొబైల్ రీచార్జి దగ్గర నుండి బీర్, బిర్యానీ, కోడీ, బార్లు, పబ్ లలో ఆఫర్లు, గోల్డ్ డాలర్లు ఇలా ఎన్నెన్నో ఆఫర్లు ప్రకటించారు.