CM KCR Independent Diamond Festivals
CM KCR Independent Diamond Festivals : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ పరోక్షంగా టార్గెట్ చేశారు. విశ్వమానవుడిని అనుకుంటూ కొందరు వ్యక్తులు.. భారత కూర్పును చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ ముష్కరులనే పారదోలిన గడ్డ భారత గడ్డ అని.. మనలో వచ్చిన బ్లాక్ షీప్స్‌ని తరిమికొట్టే టైం కూడా వస్తుందన్నారు. కొన్ని చిల్లర శక్తుల ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు అని తేల్చి చెప్పారు. జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను అందరూ ఖండించాలని పిలుపు ఇచ్చారు.
ఆగస్టు 8న హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వేలాది మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయిందని తెలిపారు.
Azadi Ka Amrit Mahotsav : స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి గడప,గడపకు తెలిసేలా చేయాలి-సీఎం కేసీఆర్
తెలంగాణను కొంత బాగు చేసుకున్నామని…ఇంకా పురోగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం నెగ్గకున్నా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందన్నారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. కొంత మంది గాంధీని కించ పర్చే వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది దురదృష్టకరం అన్నారు. తెలంగాణ బిడ్డ నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించటం అభినందనీయమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం మనమందరం పునరంకితం అవుదామని సీఎం కేసీఆర్ చెప్పారు.
అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని. 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుందన్నారు. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయి. కొత్త తరాలు వస్తున్నాయి. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవని తెలిపారు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం, విధి అన్నారు.