Kurnool Diamonds Hunt
Kurnool Diamonds Hunt: చినుకు పడితే చాలు.. ఇక్కడి పొలాల్లో వజ్రాల పంట పడుతుంది. అందుకోసం ప్రతి ఏడాది తొలకరి జల్లులు ఎప్పుడు పడతాయా అని అనంతపురం, కర్నూలు జిల్లా వాసులు ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో పక్క జిల్లాల నుండి కూడా క్యారేజీలో కట్టుకొని మరీ ఇక్కడకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. ఇక్కడి బంగారు వ్యాపారాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా దొరికిన ప్రజల వద్ద కొనుగోలు చేసి వారికి డబ్బు చెల్లిస్తుంటారని చెప్తారు.
గత వారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతుకు మూడు కోట్లు విలువ చేసే వజ్రం లభ్యమైనట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. దానిని రహస్యంగా వ్యాపారి వద్దకు తీసుకెళ్లడంతో 30 క్యారెట్ల వజ్రమని తేలడంతో రైతుతో బేరసారాలు ఆడి కోటి 20 లక్షల రూపాయలకు కొనేసుకున్నాడట. సోషల్ మీడియాలో వజ్రం ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కాగా.. అది అలా ప్రచారంలో ఉండగా మరో ఇద్దరికి వజ్రాలు దొరికినట్లు తెలుస్తుంది. ఈ రెండు వజ్రాలు కూడా తుగ్గలి మండలం జోన్నగిరిలోని పోలంలోనే లభ్యమైనట్లు తెలుస్తుంది.
ఓ రెండు రైతు కుటుంబాలు ఈ వజ్రాల వేట సాగించగా ఇద్దరికీ వజ్రాలు దొరికినట్లు చెప్తున్నారు. ఈ రైతుల నుంచి రెండు వజ్రాలను ఒక్కొకటి లక్షా ఐదు వేలు చూపిన స్థానిక వ్యాపారి ఒకరు కొనుగొలు చేసినట్లు తెలుస్తుంది. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే మొత్తం మూడు వ్రజాలు లభ్యమవడంతో స్థానిక ప్రజలు పొలాలలో తీవ్రంగా వెతుకులాట మొదలుపెట్టారు. జొన్నగిరి పొలాలలో ఎక్కడ చూసినా ప్రజలు వజ్రాల కోసం వెతుకులాటలోనే కనిపిస్తున్నారు.