Gas Bore Well In Kerala
Gas Bore well In Kerala : కేరళలోని అలప్పుజ జిల్లాలోని ఓ కుటుంబానికి వంట గ్యాస్ ధర ఎంత పెరిగినా బాధే లేదు. ఆందోళనా లేదు. అయ్యో..కూర మధ్యలో ఉండగా సిలిండర్ లో గ్యాస్ అయిపోయిందే అనే ఇబ్బంది అంతకంటే లేదు.ఎల్పీజీ సిలిండరు బయట మార్కెట్‌లోని గ్యాస్ ధరలను పట్టించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే వారి ఇంటి పెరిటిలోని బోరుబావి నుంచి వచ్చే గ్యాస్ తోనే చక్కగా వంట చేసేసుకుంటున్నారు. అదికూడా గత తొమ్మిదేళ్లనుంచి.. అదేంటీ పెరిటిలో ఉండే గ్యాసా..ఇదేందమ్మో ఎక్కడా ఇనలా..ఏడా చూడలా అనుకుంటున్నారా? నిజమే నిజంగా వింతే..
కేరళలోని అలప్పుజ జిల్లాలోని అరుత్తువళి ప్రాంతంలో రత్నమ్మ కుటుంబం నివసిస్తోంది. వారికి నీటి కొరత ఉండటంతో బోరు తవ్వించాలనుకున్నారు. అలా బోరుబావి తవ్వటం ప్రారంభించారు. కానీ 16 మీటర్లు తవ్వినా ఎక్కడా చుక్క జాడే కనిపించలేదు. అలా ఇంకా లోతుగా తవ్వి ఎలాగైనా నీటి కష్టం తీర్చుకుందామనుకున్నారు. అలా తవ్వుతున్న సమయంలో పైపు దగ్గర ఉన్న ఓ వ్యక్తి సిగిరెట్ కాల్చుకోవటానికి అగ్గిపుల్ల వెలిగించాడు. అంతే ఒక్కసారిగా భగ్గుమంటూ మంటలు వచ్చాయి. దీంతో కాస్త కంగారుపడ్డారు. ఇంట్లోంచి గ్యాస్ లీక్ అయ్యిందా ఏంటీ అనుకున్నారు.
కానీ మరోసారి అలాగే జరిగింది. దీంతో కాస్త భయపడ్డారు. గ్యాస్ లీక్ కొనసాగడంతో ఆందోళన చెందారు. ఈ విషయం కాస్తా అధికారులకు తెలుపగా.. రత్నమ్మ ఇంటి పెరటిలోకి వచ్చిన జియాలజీ, పెట్రోలియం శాఖల అధికారులు పరీక్షలు నిర్వహించారు. బోరుబావి నుంచి వస్తున్న గ్యాస్ మీథేన్ అని, దాని గురించి ఆందోళన పడవద్దని చెప్పారు. ఆ బోరు బావి నుంచి నీరు ఎలాగు పడటంలేదు..కనీసం ఆ గ్యాస్ తో వంట చేసుకుందామని అనుకున్న రత్నమ్మ కుటుంబం ప్లంబర్‌ను పిలిచి బోరు నుంచి పొయ్యికి పైపులు బిగించింది. అప్పటి నుంచి రత్నమ్మ కుటుంబం పెరటి గ్యాస్‌తోనే వంట చేసుకుంటున్నారు.
ఈ గ్యాస్ వల్ల పేలుడు జరిగే అవకాశం ఉందని భయపడ్డారు రత్నమ్మ కుటుంబం. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రత్నమ్మ చెప్పారు. కానీ ఆ ప్రాంతంలో నీటి ఉదృతి పెరిగి వరదలు వస్తే తప్ప గ్యాస్‌కు కొరత ఏర్పడదని చెబుతున్నారు రత్నమ్మ. రత్నమ్మ కుటుంబం ఈనాటికి ఆ బోరుబావి నుంచి వచ్చే గ్యాస్ తోనే చక్కగా వంట చేసుకుంటున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించటానికి రీసెర్ చేసే విద్యార్థులు వస్తున్నారు. గ్యాస్ నమూనాలు సేకరిస్తున్నారు. ఎవరొచ్చి వెళ్లినా..రత్నమ్మ కుటుంబం మాత్రం బోరుబావి గ్యాస్ తో నే చక్కగా అన్ని వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ అయిపోతుందనే భయమేలేదు.