Borewell
borewell: పొలం దగ్గర ఆడుకుంటోన్న ఓ బాలిక ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయి, 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. ఆ బాలికను జవాన్లు ఐదు గంటల వ్యవధిలో చాకచక్యంగా బయటకు తీసి, ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మీడియాకు వివరించి చెప్పారు.
గజన్వావ్ గ్రామంలో మనీషా అనే 12 ఏళ్ళ బాలిక ఇవాళ ఉదయం 7.30 గంటలకు బోరుబావిలో పడిపోయిందని చెప్పారు. ఆ బోరు బావి దాదాపు 500 నుంచి 700 అడుగుల లోతు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారని వివరించారు. ఆర్మీ జవాన్లతో పాటు పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారని చెప్పారు. దాదాపు 5 గంటల పాటు కష్టపడి ఆ బాలికను సురక్షితంగా బయటకు తీశారని తెలిపారు.
సహాయక చర్యల్లో భాగంగా బోరుబావిలోని బాలికకు ఆక్సిజన్ కూడా పంపినట్లు వివరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని కెమెరా ద్వారా పరిశీలించామని చెప్పారు. బోరుబావిలోంచి ఆమెను తీసిన అనంతరం ధృంగాధ్రలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ధృంగాధ్రలోనే రెండు నెలల క్రితం రెండేళ్ళ బాలుడు బోరుబావిలో పడ్డాడు. అతడిని కూడా ఆర్మీ జవాన్లు మూడు గంటల్లో బయటకు తీశారు.
Teacher recruitment scam: ఇప్పుడు అర్పితా ముఖర్జీ ఆఫీసులపై ఈడీ దృష్టి