Husband Threw The Wife And Children Into The Well
Husband threw wife in well: రెండవ సంతానంగా కొడుకు పుట్టలేదని భార్యని, ఇద్దరు ఆడపిల్లలని బావిలో తోసాడు భర్త.. భార్య, చిన్నకూతురు ప్రాణాలతో బయటపడగా పెద్ద కూతురు మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతార్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఛతార్పూర్‌కు చెందిన రాజా బైయా యాదవ్ భార్య కొద్దీ రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే వారికి అప్పటికే ఎనిమిదేళ్ల అమ్మాయి ఉంది. రెండవ సంతానంగా కొడుకు పుడతాడని రాజా బైయా అనుకున్నాడు.. కానీ సంతానం కూడా అమ్మాయి కావడంతో నిరాశ చెందాడు.
మూడు నెలల నుంచి భార్య పుట్టింట్లో ఉన్నా వారిని చూసేందుకు కూడా వెళ్ళలేదు. మూడు నెలలు పూర్తి కావడంతో ఆదివారం భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు వెళ్ళాడు. తీసుకొస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండి ఆపి ఇద్దరు కూతుర్లను భార్యను బావిలో తోశాడు. ఈత రాకపోవడంతో పెద్ద కూతురు నీటిలో మునిగి మృతి చెందింది.
భార్య చిన్న కూతురు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బావిలో ఉన్న భార్యపై రాజా రాళ్లు విసరడంతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు వచ్చి తల్లి బిడ్డను కాపాడారు. స్థానికులను గమనించిన రాజా అక్కడి నుంచి పారిపోయాడు. కాగా కొడుకు పుట్టలేదని కోపంతోనే రాజా బైయా యాదవ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఛతార్పూర్ పోలీసులు తెలిపారు.