Software Engineer Dies In Nepal : నేపాల్ లో ఎవరెస్ట్ పర్వతారోహణ కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు విగతజీవిగా మారాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల రాజశేఖర్ రెడ్డి 4వేల 900 మీటర్ల ఎత్తులో ఉన్న లోబుచే పర్వతాన్ని చేరుకుని గోల్ రీచ్ అయ్యాడు. అనంతరం అక్కడే లాడ్జిలో బస చేశాడు.
పర్వతారోహణ టాస్క్ కంప్లీట్ చేసుకున్నా.. చలికి మాత్రం తట్టుకోలేకపోయాడు. తీవ్ర మంచు కారణంగా అస్వస్థతకు గురై గుండెపోటుతో లాడ్జిలోనే మృతి చెందాడు. లాడ్జి నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నేపాల్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ లో స్థిరపడిన రాజశేఖర్ రెడ్డి.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి మృతితో ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రాజశేఖర్ రెడ్డికి.. పర్వతారోహణ హాబీ. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు పర్వతాలను అధిరోహిస్తున్నాడు. నిన్న దాదాపు తన గోల్ రీచ్ అయ్యాడు. మరికొంత గోల్ మిగిలి ఉంది. ఇంతలోనే అతడి శ్వాస ఆగిపోయింది. స్థానికంగా ఉన్న లాడ్జిలో రాజశేఖర్ రెడ్డి బస చేశాడు. తెల్లవారాక ఎంత సేపటికీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో హోటల్ సిబ్బంది మరో కీ తో డోర్ ఓపెన్ చేసి చూశారు. లోపల బెడ్ పై రాజశేఖర్ రెడ్డి విగతజీవిగా కనిపించేసరికి సిబ్బంది షాక్ అయ్యారు. గుండెపోటుతో రాజశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు గుర్తించారు.