Sajjala Ramakrishna Reddy
sajjala: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన వచ్చే రెండేళ్ళలో ఎలా ఉండబోతుందనే అంశాలను వివరించడంతో పాటు పలు విషయాలపై సీఎం జగన్ నేడు దిశానిర్దేశం చేస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో ప్లీనరీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నేడు జగన్ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల 10 టీవీతో మాట్లాడుతూ… అధికారంలోకి రావాలని చంద్రబాబు అండ్ కో గుంటనక్కల్లా చూస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు, పవన్‌లవి మొక్కుబడి విమర్శలని, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడి ధరల బాదుడుని తట్టుకోలేకే ప్రజలు ఆయనను గద్దెదించారని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికల్లోనూ గెలుస్తున్నామని, ప్రజలు తమవైపే ఉన్నారని తమ విజయాలే చెబుతున్నాయని అన్నారు. వైసీపీ పాలన బాగోలేకపోతే తమ కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.