Jr NTR: పాన్ ఇండియా సినిమాలపై తారక్ షాకింగ్ కామెంట్స్!
విజయ్ దేవరకొండ నుండి మంచు విష్ణు వరకు.. బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు మన దగ్గర ఎవరి సినిమా గురించి విన్నా పాన్ ఇండియా లెవల్ సినిమా అనే మాట వస్తుంది.
- Naresh Mannam
- Published On : May 13, 2021 / 05:59 PM IST
Jr Ntr Tarak Shocking Comments On Pan India Movies
Jr NTR: విజయ్ దేవరకొండ నుండి మంచు విష్ణు వరకు.. బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఇప్పుడు మన దగ్గర ఎవరి సినిమా గురించి విన్నా పాన్ ఇండియా లెవల్ సినిమా అనే మాట వస్తుంది. టాలీవుడ్ నుండి బాహుబలి, శాండల్ వుడ్ నుండి కేజీఎఫ్, కోలీవుడ్ నుండి రోబో ఇలా కొన్ని సినిమాలు సౌత్ సినిమా సత్తా చాటుతూ దేశవ్యాప్తంగా పేరు మ్రోగిపోయింది. దెబ్బకు బాలీవుడ్ నటీనటులు కూడా ఉత్తరాది, దక్షణాది అనే తేడాలు మరిచి మన సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటే.. మన సినిమా మార్కెట్ కు ఉపయోగపడుతుందని మన వాళ్ళు జాతీయస్థాయి సినిమాలనే తెరకెక్కిస్తున్నారు.
కాస్త ఇక్కడ స్టార్ స్టేటస్ ఉన్న హీరోల నుండి బాలీవుడ్ లో తెలిసిన దర్శకుల వరకు అందరూ వారి సినిమాలకు పాన్ ఇండియా అనే పేరు పెట్టేస్తున్నారు. ఒకవిధంగా అందరూ పాన్ ఇండియా జపమే చేస్తున్నారు. అయితే మన బుల్లి రామయ్య మాత్రం ఆ పదమే తనకు నచ్చదని చెప్పేశాడు. అదే జూనియర్ ఎన్టీఆర్ కు అసలు పాన్ ఇండియా పదాన్ని వింటే అదేదో వంట పాత్ర గుర్తొస్తున్న ఫీల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. తారక్ ప్రస్తుతం కరోనాతో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇంటి నుండే ఓ అంతర్జాతీయ ఆన్ లైన్ మీడియాతో మాట్లాడిన తారక్ పలు విషయాలపై తనదైన సమాధానాలను చెప్పాడు. ఇందులో భాగంగానే పాన్ ఇండియా సినిమాల ప్రస్తావన రావడంతో ఒక మంచి సినిమాను దేశంలో ఉన్న అనేక భాషల్లో చూపించడమే తమ ఉద్దేశమని చెప్పిన తారక్ పాన్ అనే పదం వింటే వంట పాత్ర గుర్తుకొస్తుందని చెప్పాడు. ఇక హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడిన తారక్ అక్కడ అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు.. నేను కూడా అంతే అని సింపుల్ గా చెప్పేశాడు. ఒకవేళ దర్శకుడిగా మారితే భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్ తో రావాలని ఉందని ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
