Corona-After-Vaccination
Karnataka five Doctors get Corona After Vaccination : ప్రపంచాన్ని కల్లోలం చేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది కదాని తెగ సంబరపడియాం.కానీ ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ సురక్షితమో తెలియని అయోమయంలో పడిపోతున్న పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారు మృతి చెందుతున్నారనే క్రమంలో వ్యాక్సిన్ వస్తే ఎంత ఖర్చు అయినా వేయించేసుకుందామనుకుంటే..ఇప్పుడీ భయాలు వెన్నాడుతున్నాయి.
కొందరికైతే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారిన పడుతున్న ఘటనలతో వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారిన పడటంతో కలకలం రేగింది.
చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కరోనా టీకాను తీసుకున్న తరువాత మహమ్మారి బారిన పడటంతో తీవ్ర సంచలన రేగింది. తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. ఈ డాక్టర్లు 40నుంచి 50 ఏళ్ల వారు కావటం గమనించాల్సిన విషయం.
దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
కాగా..తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోస్ ను ఇస్తారనే విషయం తెలిసిందే. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయని, అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా తొలి డోస్ తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మాస్క్ లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచించారు.