లాక్ డౌన్ : కుటుంబ సభ్యులను కలిపితే రూ.10 లక్షలు

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్రకటించడాని కంటే ముందు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినవారు మళ్లీ ఒక చోటుకు చేరలేకపోతున్నారు. ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పటికే ఈ నిర్బంధం విధించి రెండు నెలలు గడుస్తున్నా ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను స్వస్థలానికి చేర్చేందుకు శత విధాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. దీంతో ఈ సారి వారిని కలిపితే పారితోషికం ఇస్తానంటూ ప్రకటించి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు.
కేరళకు చెందిన శ్రీకుమార్ పని కోసం దుబాయ్ కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. మరోవైపు అతని భార్య, చిన్న కొడుకు మంగళూరులో, పెద్ద కొడుకు తిరుచ్చిరాపల్లిలో ఉన్నారు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న వారిని ఒకచోటికి చేర్చేందుకు అతడు అనేక ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఎంతో మంది అధికారులను సంప్రదించాడు. కానీ వారి నుంచి కనీస స్పందన కూడా లేకుండా పోయింది.
దీంతో అతనే సొంతంగా ఓ హెలికాప్టర్ ను మాట్లాడుకున్నాడు. కానీ అది ఎగరడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో అతను చివరి ప్రయత్నంగా సోషల్ మీడియా ఏమైనా సాయం చేస్తుందేమో చూద్దామనుకున్నాడు. తన కుటుంబ సభ్యులను ఇంటికి సురక్షితంగా చేర్చితే రూ.10 లక్షల నజరానా ఇస్తానని ప్రకటించాడు. అంతేకాకుండా మంగళవారంలోపు ఇంటికి చేర్చాలని గడువు విధించాడు.