Parrot
Parrot: ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక కనపడకుండా పోవడంతో ఓ కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఆ చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆ చిలుక దొరికింది. దీంతో ఆ కుటుంబంలోని వారి ఆనందానికి అవధులు లేవు. చిలుకను గుర్తించి తమకు చెప్పిన వ్యక్తికి ఈ సంతోషంలో రూ.50 వేలకు మించి బహుమతి అందించారు. అంటే రూ.85 వేలు ఇచ్చారు. ప్రకటించిన దానికంటే రూ.35 వేలు ఎక్కువగా ఇచ్చారు.
ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటు చేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఆఫ్రికన్ గ్రే రకానికి చెందిన చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే, అది ఈ నెల 16న ఎగిరిపోయింది. ఆ చిలుకను తనకు తిరిగి అప్పజెప్పిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆయన ఇంటి నుంచి ఆ చిలుక కొన్ని కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి దొరికింది. అది ఆ సమయంలో చాలా బలహీనంగా, ఆకలితో కనపడింది. దీంతో ఆ చిలుక యజమాని అర్జున్‌కు ఫోన్ చేసి గత రాత్రి దాన్ని ఆయనకు అందించాడు.
తన చిలుక ఆకలితో బాధపిందని, శ్రీనివాస్ అనే వ్యక్తి కాపాడి ఆహారం పెట్టాడని అందుకే చెప్పిన దానికంటే రూ.35 వేలు ఎక్కువగా నగదు బహుమతి అందించానని అర్జున్ తెలిపాడు. ఆ చిలుక తమ వద్ద రెండున్నర ఏళ్ళుగా ఉంటోందని చెప్పాడు. కాగా, వారం రోజులుగా ఆ చిలుక బొమ్మతో స్థానికంగా అర్జున్ పోస్టర్లు వేయించాడు. ఈ పోస్టర్లను చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిలుక తప్పిపోతే ఇంతలా వెకతడం ఏంటని అన్నారు. ఎట్టకేలకు వారు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.. చిలుక దొరికింది.
corona: దేశంలో 1,50,100కు చేరిన కరోనా యాక్టివ్ కేసులు