Sushil Modi's 'comedy show' comment
Sushil Modi’s ‘comedy show’ comment: దేశంలోని విపక్షాల ఐక్యత పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమావేశం కావడాన్ని ‘విపక్ష పార్టీల కొత్త కామెడీ షో’ అంటూ బీజేపీ బిహార్ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఎద్దేవా చేశారు. అలాగే, గత లోక్‌సభ ఎన్నికల్లో సొంత కూతురు మిసా భారతిని గెలిపించడంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విఫలమయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆయన కుమార్తె కవితను గెలిపించలేకపోయారని విమర్శించారు. దీనిపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. సుశీల్ కుమార్ మోదీ చేసే వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
”సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? కనీసం ఆయన పార్టీ కూడా పట్టించుకోదు. ఆయన ఏ వ్యాఖ్యలు చేయాలనుకుంటున్నారో వాటిని చేసుకోనివ్వండి. ప్రతిరోజు ఆయన నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బీజేపీ జాతీయ నేతల దృష్టిలో పడాలనుకుంటున్నారు” అని నితీశ్ కుమార్ అన్నారు. కాగా, కేసీఆర్, నితీశ్ కుమార్ సమావేశమై దేశ రాజకీయాలు, బీజేపీని ఓడించడం వంటి అంశాలపై చర్చించారు. కేసీఆర్ గతంలోనూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిశారు.