Sonia
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుని ఆమె కోలుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేశారు. ”కరోనా అనంతర సమస్యలతో బాధపడుతూ సోనియా గాంధీ ఆదివారం న్యూఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆమె ఆసుపత్రిలో చేరారు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటోన్న కాంగ్రెస్ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు” అని రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.
prophet row: ప్రధాని మోదీ వెంటనే స్పందిస్తే బాగుండేది: చిదంబరం
కాగా, సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపగా ఆమెకు కరోనా సోకడంతో హాజరుకాలేదన్న విషయం తెలిసిందే. దీంతో జూన్ 23న విచారణకు రావాలని ఈడీ మళ్లీ సమన్లు పంపింది. అలాగే, రాహుల్ గాంధీ ఈ నెల 2న ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆయన విదేశాల్లో ఉన్న కారణంగా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న విచారణకు రావాలని ఈడీ మరోసారి సమన్లు పంపింది. దీంతో ఆయన రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.