Swallowing Artificial Tooth : పొరపాటున కృత్రిమ దంతం మింగేసింది… ప్రాణాలు పోగొట్టుకుంది.
నీళ్ళు తాగుతున్న సందర్భంలో ఓ పన్నును మింగేసింది. కొద్ది సేపటి తరువాత వాంతులు, కళ్ళు తిరగటం, అసహనంగా అనిపించటం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి.

మహిళ ప్రాణం తీసిన కృత్రిమ దంతం
Swallowing Artificial Tooth : అనేక మంది దంత సమస్యలతో బాధపడుతూ పాడై పోయిన దంతాల స్ధానంలో కృత్రిమ దంతాలను అమర్చుకుంటుంటారు. సాధారణ, మధ్యతరగతి వారు తక్కవ ఖరీదులో కృత్రిమ దంతాలను అమర్చుకుంటుండగా, కాస్త డబ్బున్న వారు బంగారు దంతాలను పెట్టించుకుంటారు. ఏదైనా గట్టి పదార్ధాలను నమిలి తినేందుకు ఇవి సహాయకారిగా పనిచేస్తాయి. అయితే ఈ కట్టుడు దంతం చెన్నైలో ఓ మహిళ పాలిట మృత్యుపాశమైంది. వివరాల్లోకి వెళితే..
చెన్నైలోని వలసరవక్కం సమీపంలోని రామాపురం ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి తన దంతాలు పాడై పోవటంతో కట్టుడుపళ్ళు పెట్టించుకుంది. రోజు వాటి సహాయంతో ఆహారం నమిలి తింటూ సౌకర్యవంతంగానే జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా నీళ్ళు తాగుతున్న సందర్భంలో ఓ దంతాన్ని మింగేసింది. కొద్ది సేపటి తరువాత వాంతులు, కళ్ళు తిరగటం, అసహనంగా అనిపించటం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ చేసిన వైద్యులు రిపోర్ట్ లో ఏమి లేదని నిర్ధారించారు. ఆసుపత్రిలో మందులు తీసుకుని ఇంటికి చేరిన ఆమె మళ్ళీ అస్వస్ధతకు లోనైంది. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెను పోస్టుమార్టం నిమిత్తం శవాగారానికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె మృతికి దంతం కారణమని తేలింది. మింగిన దంతం శాసనాళాల్లోకి చేరటం వల్ల ఊపిరి సరిగా ఆడక, లోపలి నాళాలు దెబ్బతిని రక్తస్రావంతో చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. దీనిని దంత వైద్యులు కూడా దృవీకరించటంతో అప్పటి వరకు అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు కేసును క్లోజ్ చేశారు.