Vijayendra Prasad announced movie on RSS
Vijayendra Prasad : ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్‌మాధవ్ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్’ అనే పుస్తకం లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయేంద్రప్రసాద్. విజయవాడలోని కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ”కొన్నేళ్ల క్రితం వరకు నాకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి అంతగా తెలీదు. దానిపై అంతగా మంచి అభిప్రాయం కూడా లేదు. కానీ ఆర్‌ఎస్‌ఎస్ పై సినిమా తీయమని నా దగ్గరకి కొంతమంది వచ్చినప్పుడు ఓకే చెప్పాను. దాని గురించి తెలుసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ మెయిన్ బ్రాంచ్ నాగ్‌పూర్ వెళ్ళాను. అక్కడ చాలా వాస్తవాలను తెలుసుకున్నాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. ఆర్‌ఎస్‌ఎస్ తాను చేసే మంచి పనులు చెప్పుకోదు, కానీ చెప్పుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ పై కథ ఆల్రెడీ రెడీ చేసేశాను. ఆ కథతో వెళ్లి మోహన్ భగత్ గారిని కలిశాను. ఆయన కథంతా విని చిన్న పిల్లాడిలా నవ్వారు. త్వరలోనే సినిమా తీద్దాం అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై త్వరలోనే సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా తీస్తాను” అని ప్రకటించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా అనడంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి బీజేపీ మద్దతు కచ్చితంగా ఉంటుంది. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో సంచలన అంశంగా మారింది.