Windy Rain in Bhadradri: భద్రాద్రి జిల్లాలో ఈదురు గాలుల వర్షం.. రైతులకు అపార నష్టం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం రాత్రి పెద్దఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. గాలిదుమారం, వర్షం కారణంగా మామిడికాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Windy Rain in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం రాత్రి పెద్దఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. గాలిదుమారం, వర్షం కారణంగా మామిడికాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా మారింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోయి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయింది. రైతాంగం పడరాని పాట్లు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు, విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు. రబీ వరి కొంతమేర నూర్పిడి దశలో ఉండటంతో ధాన్యం రాశులు కళ్లాల్లో ఉండిపోయాయి. దీంతో వర్షం వల్ల ధాన్యం రాశుల అడుగుకినీరు చేరడంతో పాటు బస్తాల్లో పట్టిన ధాన్యం తడిసిపోయింది.

తడిసిన ధాన్యాన్ని బయటకు తీసుకురావడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలనీ రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు ఏపీలోని గోదావరి జిల్లాలలో పలుచోట్ల ఇదే పరిస్థితి. రాత్రి సమయంలో కురిసిన అకాల వర్షానికి చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. గత వారంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతను కలవరపెట్టింది. మళ్ళీ బుధవారం రాత్రి అదే ఈదురుగాలుల వర్షంతో గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలలో రైతులు తీవ్ర నష్టం జరిగింది.

Read: Corona Second Wave: కాలుతున్న కరోనా కాష్టం.. కాటికాపరులకే కన్నీరు!

ట్రెండింగ్ వార్తలు