Corona Second Wave: కాలుతున్న కరోనా కాష్టం.. కాటికాపరులకే కన్నీరు!

రోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే ఆక్సిజన్ సరిపోక యుద్ధమే జరుగుతుంది.

Corona Second Wave: కాలుతున్న కరోనా కాష్టం.. కాటికాపరులకే కన్నీరు!

Corona Second Wave Tearful Corona Deaths

Corona Second Wave: కరోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే ఆక్సిజన్ సరిపోక యుద్ధమే జరుగుతుంది. పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రులలో కూడా బెడ్స్ సరిపోక అడ్మిట్ కోసం కరోనా రోగులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి పలు రాష్ట్రాలలో దాపురిస్తుంది. మరోవైపు ఐసీయూ సదుపాయాల కొరతతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో ఆసుపత్రుల మార్చురీలు సరిపోవడం లేదు.

కరోనాతో మరణించిన మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ చేయాల్సి రావడంతో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతతో మార్చురీలలో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు శ్మశానాలలో క్యూలో పెట్టాల్సిన దౌర్భాగ్యం మన దేశంలో కనిపిస్తుందంటే సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విరుచుపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. రోజుకి పదుల సంఖ్యలో మృతదేహాలను దహనం చేసే కాటికాపరులే వందల సంఖ్యలో మృతదేహాలు చితిలో దగ్ధమవుతుంటే కన్నీరు కారుస్తున్నారు. ఓవైపు మండే చితిమంటలు.. మరోవైపు ఆప్తుల ఆర్తనాదాలు.. అసాధారణరీతిలో శవాలు.. వరుసపెట్టి చితి మండిస్తుంటే.. కొవిడ్ కల్లోలానికి వల్లకాడు సైతం వల్లకాదంటోంది.

మరుభూమిలో కట్టెపట్టుకుని నిలుచుకునే కాటికాపరులే కాలుతున్న కాష్ఠాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు. మహాప్రస్థానంలో కాలుతూనే ఉన్న కట్టెలు కల్లోలానానికి అద్దం పడుతున్నాయి. రోజు రోజుకీ శ్మశానానికి వరుసకడుతున్న మృతదేహాలు మహాప్రస్థానాన్ని వెక్కిరిస్తున్నాయి. ఒకప్పుడు రోజుకి నాలుగైదు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన కాటికాపరులు రోజుకి వందల సంఖ్యలో శవాలను దహనం చేస్తూ రోదిస్తున్నారు. సాధారణ మరణాలైతే అంతిమ సంస్కారాలకు బంధువులు వెళ్తారు. కోవిడ్ మరణాల మృతదేహాల వెంట ఎవరూ రావడం లేదు.

దిక్కులేని అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించే ఛారిటబుల్ ట్రస్టులే కొన్నిచోట్ల అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల జిప్ వేసిన శవాలను మూటతోనే చితి మీద పేరుస్తున్నారు. వందలలో దహన సంస్కారాలతో శ్మశానాలూ రద్దీగా మారడంతో అక్కడా అస్థికలు గుట్టలుగా మారుతున్నాయి. పారిశుధ్య లేమితో మహా ప్రస్థానం మురికి కూపమవుతుంది. మహమ్మారి శాంతించే రోజు ఎన్నడో కానీ ఈలోగా కాటుకి బలికాకుండా ఉండాలనన్నదే ప్రతి ఒక్కరి ముందు జాగ్రత్త.. అదే బాధ్యత. రక్కసి చేతికి చిక్కకుండా ఉండాలంటే మన ముందున్న ఆయుధాలు మూడే మూడు.. మూతి, ముక్కుకు మాస్క్, చేతికి శానిటైజర్.. అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా.. వెళ్లినా సామాజిక దూరం పాటించడమే మనకున్న ఏకైక మార్గం.. మళ్ళీ మళ్ళీ చెప్పే మాట తస్మాత్ జాగ్రత్త.. మన ముందుంది మనిషిని మింగేసే మహమ్మారి.