Abdominal Sounds : పొట్ట పేగుల్లో నుండి శబ్ధాలు వస్తున్నాయా?…ఎందుకలా?..
చాలా ప్రేగు శబ్దాలు సాధారణమైనవి. ఇలా శబ్ధాలు వస్తున్నాయంటే జీర్ణశయాంతర ప్రేగు పని చేస్తుందని అర్థం. స్టెతస్కోప్ తో పొట్టలోపలి పేగుల కదలికల్లో వచ్చే శబ్దాలను వినవచ్చు.
- Guntupalli Ramakrishna
- Published on- December 23, 2021 / 12:43 PM IST
Abdominal Sounds
Abdominal Sounds : మన జీర్ణవ్యవస్థలో జీర్ణాశయం, పేగులు చాలా ముఖ్యమైన భాగాలు. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయ్యాక చిన్న పేగులకు చేరుతుంది. అక్కడ ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. తరువాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు ద్వారా బయటకు వస్తాయి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంటుంది. అయితే కొన్ని సార్లు మనకు పేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో అసౌకర్యానికి గురవుతుంటాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న.. కడుపులో నుండి శబ్దాలు ప్రేగుల కదలిక ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. ప్రేగులు బోలుగా ఉంటాయి. పైపుల్లో నుండి నీరు ప్రవహించే సమయంలో ఎలా శబ్ధం వస్తుందో అదేతరహాలో పేగుల్లో నుండి శబ్దాలు పొట్ట పై భాగానికి వినిపిస్తుంటాయి.
చాలా ప్రేగు శబ్దాలు సాధారణమైనవి. ఇలా శబ్ధాలు వస్తున్నాయంటే జీర్ణశయాంతర ప్రేగు పని చేస్తుందని అర్థం. స్టెతస్కోప్ తో పొట్టలోపలి పేగుల కదలికల్లో వచ్చే శబ్దాలను వినవచ్చు. చాలా ప్రేగు శబ్దాలు ఎలాంటి హానిచేయనివనే చెప్పాలి. అయితే అసాధారణ శబ్దాలు సమస్యను సూచిస్తున్నట్లుగా గుర్తించాలి. పేగుల్లో ఆహారం కదలికల వల్ల కొన్ని సార్లు గ్యాస్ ఏర్పడి అది శబ్దాలుగా మారుతుంది. అయితే ఒక మోస్తరు స్థాయిలో శబ్దాలు వస్తే ఖంగారు పడాల్సిన పనిలేదు. అది సాధారణమే. దాంతో ఎలాంటి హాని కలగదు. కానీ అసలు శబ్దాలు రాకపోతే.. అలాంటి వారు మలబద్దకంతో బాధపడుతున్నట్లు అర్థం. లేదా ఇతర జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటి వారికి పేగుల నుంచి శబ్దాలు రావు.
నిద్రలో హైపోయాక్టివ్ ప్రేగు శబ్దాలు సాధారణం. కొన్ని మందులు వాడిన తర్వాత మరియు పొత్తికడుపు శస్త్రచికిత్స తర్వాత కూడా ఇవి సాధారణంగా జరుగుతాయి. ప్రేగు శబ్దాలు తగ్గడం లేదా లేకపోవడం తరచుగా మలబద్ధకాన్ని సూచిస్తాయి. ఇక పేగుల నుంచి శబ్దాలు మరీ ఎక్కువగా వస్తుంటే.. గ్యాస్ లేదా విరేచనాల సమస్య ఉందని తెలుసుకోవాలి. లేదా వికారం, వాంతులు అయ్యే వారికి, అవబోతున్న వారికి ఇలా పేగుల నుంచి ఎక్కువగా శబ్దాలు వస్తుంటాయి. కనుక శబ్దాల తీవ్రతను బట్టి మనకు కలిగే అనారోగ్య సమస్యలను ముందుగానే అంచనా వేయవచ్చు. శబ్దాలు అసలు రాకపోయినా, మరీ ఎక్కువగా వస్తున్నావైద్యుడిని సంప్రదించటం మంచిది.
